Admissions new school | కోరుట్ల, జూలై 14: పట్టణంలోని మాదాపూర్ కాలనీలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల కోసం అధికారులు సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రవేశాల కోసం కాలనీలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు అధికారులు సమాచారం సేకరించారు. కాలనీలో నివాసముంటున్న తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను నూతనంగా ఏర్పాటు చేసే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు.
30 మంది విద్యార్థులను గుర్తించిన అధికారులు వారి వివరాలను నమోదు చేసుకున్నారు. కాగా కోరుట్ల శివారులోని మాదాపూర్ కాలనీలో సుమారు 500 కుటుంబాలు నివసిస్తుండగా, పాఠశాల సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాదాపూర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని ఇటీవల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను కలిసి వినతి చేశారు.
దీంతో శనివారం విద్యాశాఖ డైరెక్టర్ మాదాపూర్ కాలనీకి ప్రాథమిక పాఠశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్వేలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, మెప్మా ఆర్పీ ఇర్ఫాన బేగం, అంగన్ వాడీ టీచర్ అనసూయ, పేరెంట్స్ కమిటీ సభ్యులు షేక్ అజార్, రిహన బేగం, సీఆర్పీలు సత్యనారాయణ రావు, దేవేందర్, గంగాధర్, మాన్విత, జ్యోతి పాల్గొన్నారు.