Protocol | సిరిసిల్ల టౌన్, మే 25: సిరిసిల్లలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో వివాదం మొదలైంది. ఇటీవల గంభీరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ఫొటో పెట్టాలని అడిగినందుకు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ ఉల్లంఘనపై జిల్లా ఎస్పిని కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రా పంపిణీ కార్యక్రమంలో మరోసారి ప్రొటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ కేటీఆర్ ఫొటో పెట్టకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కళాశాల మైదానం వద్దకు చేరుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా సమాచారం తెలుసుకున్న పోలీసులు మాట్ల మధుతో పాటు నాయకులు సిలువేరి చిరంజీవి, తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మాట్ల మధు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరు బాదాకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రోటో అధికారి ఏకపక్ష దోరణితోనే కేటీఆర్ ఫోటో పెట్టడంలేదన్నారు. వీరి వ్యవహారంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ విషయంపై తాము జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికీ సిరిసిల్ల పట్టణ కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలోనూ కేటీఆర్ ఫొటో ఏర్పాటుచేయలేదన్నా ప్రొటోకాల్ ఉలంఘనపై మానవ హక్కుల కమిషన్ కి పిర్యాదు చేసామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండేటి ప్రేమ్ కుమార్, సిలువేరు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.