Odela | ఓదెల, జులై 10 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలలో ఒకటైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 12, 13 తేదీల్లో పెద్దపట్టం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గత మార్చి నెలలోని ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఓదెల మల్లికార్జున స్వామి జాతర నాలుగు నెలల పాటు అత్యంత వైభవంగా ప్రతీ ఆది, బుధవారాల్లో జరిగాయి. ఈ జాతర వేసవి కాలమంతా జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు.
జులై నెలలోని రెండో ఆదివారం జరిగే పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో ఈ జాతర ముగియనుంది. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానుండటంతో గత వారం రోజులుగా ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. 12న రాత్రి 8 గంటలకు శ్రీ భద్రకాళి అవహన, రాత్రి 10 గంటల నుంచి పెద్దపట్నం, 13న తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిగుండం దాటుట, అనంతరం దక్షయాగ కథ శ్రవణం, గెలుపు ఉత్సవములు, ఉదయం 9 గంటలకు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి.
పెద్ద పట్నం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో నిర్వహించనున్నారు. ఇందుకు ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య, ధర్మకర్తలు, ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గు పూజారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతోపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ, ఆలయం చుట్టూ పరిసరాలను శుభ్రం చేయడం, ఆలయం నుంచి ఓదెల రైల్వే స్టేషన్ వరకు విద్యుత్ దీపాల ఏర్పాటు, ప్రత్యేక పూజలు నిర్వహణకు వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులను పిలిపిస్తున్నారు.