Odela Mallanna Temple | ఓదెల, జూన్ 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. వచ్చేనెల 13వ తేదీ పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో మల్లన్న ఆలయ జాతర ముగియనుంది. అలాగే సకాలంలో వర్షాలు పడితే రైతులు వానాకాలం వ్యవసాయ పనులు నిమగ్నం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.
వివిధ దూరప్రాంతాల నుంచి రైళ్లు, ప్రత్యేక వాహనాలు, ఎడ్ల బండ్లపై భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము వరకే ఆలయ పరిసరాలని భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామి వారికి వివిధ ముగ్గుల పట్టిలతో పట్నాలు వేసి. బోనం వండి నైవేద్యం సమర్పించారు. ఇంటిల్లిపాది స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు.
భక్తుల రద్దీతో క్యూ లైన్ లో భారీగా నిలబడి ఉండి ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఆవరణ సరిపోకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రోడ్లకు ఇరువైపులా వ్యవసాయ భూములలో విడిది చేయాల్సి వచ్చింది . స్వామివారి దర్శనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ చర్యలు తీసుకున్నారు.