కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 2 : మంగళవారం నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చేపడుతున్న ఏర్పాట్లు పక్కాగా ఉండాలని లెక్కింపు పరిశీలకురాలు నజ్మా సూచించారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో గల స్ట్రాంగ్ రూం, లెక్కింపు కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు హాళ్లను ఆమె పర్యవేక్షించారు. ఏర్పాట్లపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తగిన ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేసి, సకాలంలో లెక్కింపు పూర్తయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం జరుగకుండా చూడాలన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేశ్‌బాబు, రామ్మూర్తి, రమేశ్, తదితరులు ఉన్నారు.