రామగిరి, ఫిబ్రవరి 20 : తమకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులుండాల్సి వస్తున్నదని సింగరేణి సంస్థ ఆర్జీ-3 పరిధి సెంటినరీకాలనీలోని నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్మికులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి నర్సరీ గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో విధలు బహిష్కరించి నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. యూనియన్ నాయకుడు ఉడుత శంకర్ మాట్లాడుతూ, పెండింగ్ జీతాలు చెల్లించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.