Former MLA Putta Madhukar | మంథని, మే 28: బీసీలకు సముచిత స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథనిలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ ఆవిర్భావం కంటే ముందు తెలంగాణాలోని అనేక మంది అట్టడగు బడుగు బలహీన వర్గాలు తల ఎత్తుకునే పరిస్థితులు ఉండేవి కాదన్నారు. కానీ ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలను గౌరవించి ఎస్సీలను ముందుకు తీసుకు వెళ్లారన్నారు. ముఖ్యంగా గౌడ, ముదిరాజ్ , పద్మశాలి, యాదవ కులస్తులకు రాజకీయంగా ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తూ ప్రొత్సాహం అందించి తల ఎత్తుకునేలా చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు.
నాడు మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీనవర్గాల కోసం ఆలోచన చేశారో అదే విధంగా ఎన్టీఆర్ సైతం కృషి చేశారన్నారు. మహనీయుల స్పూర్తితో ముందుకు సాగుతున్న తాము మంథనిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాడీ శ్రీనివాస్‌రెడ్డి, ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆకుల రాజబాపు, ఆరెపల్లి కుమార్, రోడ్డ కుమార్, మంథని లక్ష్మణ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.