రాష్ట్ర ప్రభుత్వం రామగిరి మండలం రత్నాపూర్లో ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు కోసం భూములు సేకరించడానికి సిద్ధమవుతుండగా.. తమ బతుకులకు భరోసాగా ఉన్న భూములను కాపాడుకోవడానికి గ్రామస్తులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. మేడిపల్లి రెవెన్యూ శివారులోగల రత్నాపూర్ రైతులు తమ పంట భూములు ఇచ్చేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే తమ గ్రామం నుంచి నాలుగుసార్లు భూములు ఇచ్చామని, మళ్లీ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
రామగిరి / కమాన్‌పూర్, ఫిబ్రవరి 15 : ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రామగిరి మండలంలోని రామగిరిఖిల్లాకు వెళ్లే దారిలో గల మేడిపెల్లి శివారులోని 243.29 ఎకరాల భూమిని సర్వే చేయడానికి గతేడాది నవంబర్‌లో తహసీల్దార్‌తో పాటు సర్వేయర్లు రత్నాపూర్ గ్రామంలోకి వెళ్లారు. దీంతో గ్రామ రైతులు వారిని అడ్డగించి, సర్వే చేయనీయకుండా వెనకి పంపించారు. ఆ తర్వాత వారు మళ్లీ ఫీల్డ్ మీదకు రాలేదు. కనీసం రైతులతో మాటా మంతీ కూడా చేయకపోవడంతో ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయిందనుకుని ఊపిరి పీల్చుకున్నారు.
రత్నాపూర్ రైతులు ఊహించని విధంగా ఇండస్ట్రియల్ ఫార్ ఏర్పాటు కోసం 243.29 ఎకరాల భూమిని సేకరిస్తామని ఈ నెల 11న పెద్దపల్లి కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో రైతులకు సంబంధించిన 61 సర్వే నెంబర్లలోని 203.31 ఎకరాల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని వెల్లడించారు. అలాగే, మిగతా 140, 142, 143, 156 సర్వే నంబర్లలోని 39.38 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన నోటీస్‌ను మండల ప్రజా పరిషత్, తహసీల్దార్, రత్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డ్డులో అంటించారు. ఈ భూమి ప్రణాళికలను మంథని కార్యాలయంతో పాటు కలెక్టరేట్లో ఉంచారు.
ఇండస్ట్రియల్ పార్ కోసం భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ కావడంతో బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తమ పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ గ్రామ నడిబొడ్డున బొడ్రాయి విగ్రహానికి వినతి పత్రం అందజేసి వినూత్న నిరసన తెలిపారు. అలాగే, రామగిరి మండల తహసీల్దార్‌కు కూడా వినతి పత్రం అందజేశారు. సిరులు పండే పంట భూములను తమ నుంచి లాకొని బిచ్చం ఎత్తుకునే పరిస్థితికి తీసుకు రావాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే తమ ఊరుకు చెందిన పంట భూములు తీసుకున్నారని, మళ్లీ అదే పరిస్థితి తెచ్చేలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమని, ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు.
రత్నాపూర్ గ్రామస్తులు ఇప్పటికే సింగరేణి క్వాటర్లు, గ్యాస్ పైప్‌లైన్, మంథని టూ టీఎంసీ వాటర్ పైప్‌లైన్, విద్యుత్ హై లెవెల్ స్తంభాల నిర్మాణం కోసం ఇప్పటికే 150 ఎకరాల భూములు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రియల్ పార్ కోసం అంటూ తమ భూములు లాకోవాలని చూస్తే ఎలా సహిస్తామని బాధిత రైతుల ప్రశ్నిస్తున్నారు. త్యాగానికి అంటూ ఒక హద్దు ఉంటుందని, పదేపదే ఒకే గ్రామానికి చెందిన వారే త్యాగాలు చేయాలంటే ఎలా చేస్తారంటూ నిలదీస్తున్నారు.
సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా ప్రభుత్వ, పట్టాకు సంబంధించిన వేలాది ఎకరాల భూములను అప్పట్లోనే స్వాధీనం చేసుకుంది. వీటిలో ఇంకా మిగులు భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పారు ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని సింగరేణి మిగులు భూముల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు సూచిస్తున్నారు. గతంలో సింగరేణి సంస్థకు సంబంధించిన భూముల్లో జేఎన్టీయూ ఏర్పాటు చేసిన విధంగా ప్రస్తుతం కూడా ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు చేయవచ్చు కదా! అంటూ చెబుతున్నారు.
నాకు మా గ్రామ పరిధిలోని మేడిపల్లి శివారుల ఐదెకరాల పొలం ఉంది. రెండు పంటలు పండుతది. నేనే సొంతంగా సాగు చేసుకుంటున్న. దిగుబడి కూడా మంచిగ వస్తుంది. కుటుంబ సభ్యులతో ఇన్నాళ్లుగా సంతోషంగా బతుకుతున్నం. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చినంక కష్టాలు మొదలైనయ్. ఏదో కంపెనీ వస్తుందని చెప్పాపెట్టకుండానే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ గోడకు కాగితాలు అతికించిన్రు. అందులో నా పేరుంది. నా భూమి కంపెనీనోళ్లకు అప్పగిస్తరట. ఎవరు వచ్చినా బంగారు పంటలు పండే భూమిని మాత్రం ఇవ్వను.
– బర్ల వెంకన్న , రైతు (రత్నాపూర్)
నాకు మూడెకరాల పొలం ఉంది. కంపెనీ కోసం నా భూమిని గుంజుకుంటరట. వరి వేసుకొని బతుకుతుంటే ఏదో కంపెనీ కోసం భూములు అడుగుతున్నరు. నా భూమి ఎందుకిస్త. ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంట రేవంత్‌రెడ్డి వచ్చినంక మా రైతులకు కష్టాలు ఎదురైనయ్. దరిద్రం దాపురించింది.
– కండె కొమురయ్య, రైతు (రత్నాపూర్)