MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, డిసెంబర్ 3: అభివృద్ధికి ఆమడ దూరంలో మున్సిపాలిటీలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావచ్చిందని ఇప్పటివరకు మునిసిపాటీలకు నయా పైసా నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో బుధవారం ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల మున్సిపాలిటీకి ప్రభుత్వం ఇటీవల యూఐడీఎఫ్ పథకం ద్వారా మంజూరు చేసిన రూ. 18.70 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళిక జాబితాను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతి సంవత్సరం మున్సిపాలిటీలకు టియుఎఫ్ఐడిసి, పట్టణ ప్రగతి నిధులు సక్రమంగా విడుదల చేసి పకడ్బందీగా అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటివరకు మునిసిపాలిటీలకు నయా పైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో డ్రైనేజీలు, అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన యుఐడిఎఫ్ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీలు కల్వర్టులు, రహదారులు నిర్మాణానికి నిధులు వెచ్చించాలని సూచించారు.
పట్టణ శివారులో రూ. 2కోట్లతో నిర్మించ తలపెట్టిన పార్కు నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధులను అవసరమున్న చోట కేటాయించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, డీఈ సురేష్, జేవో శివకుమార్, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రవీణ్, రమ్య తదితరులు పాల్గొన్నారు.