పలువురు ఉద్యమకారుల ఆవేదన..
Godavarikhani | కోల్ సిటీ, జూన్ 2 : విప్లవాల గని… గోదావరిఖని లో తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అవమానం జరిగింది. సకల జనుల సమ్మెకు పురుడు పోసి… ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న… ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్తూపం అలంకరణకు నోచుకోలేక బోసిపోయింది. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆత్మఘోష గొల్లుమంది. ఉద్యమాలకు ఊపిరి పోసిన ఘనత గల గోదావరిఖని గడ్డపై ఉద్యమాకారుల త్యాగాలకు విలువ లేకుండా రామగుండం నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించిన తీరు పలువురు ఉద్యమకారుల ఆవేదనకు కేంద్రమైంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటే వారం రోజుల ముందుగానే అమరవీరుల వారోత్సవాలు పండుగల జరుపుకునే ఆనవాయితీ ఉండేది.. కానీ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరపడం.. కనీసం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని అమరవీరుల స్తూపంను పూలతో అలంకరించకపోవడంతో అక్కడికి చేరుకున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు అమరవీరుల స్థూపం చూసి నివ్వెర పోయారు. ఏళ్ల తరబడి స్వరాష్ట్రం కోసం కొట్లాడి లాఠీ దెబ్బలకు ఎదురు నిలబడి.. పోరాడి ప్రాణాలను అర్పించి స్వరాష్ట్రం సాధించిన అమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, పలు సంఘాల బాధ్యులు ప్రశ్నించారు.
ఇదే విషయమై మున్సిపల్ అధికారులను అడిగితే మర్చిపోయామని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం అత్యంత బాధాకరమని దినేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రామగుండంలో నియంత పాలన పనికిరాదని, అమరవీరుల స్థూపానికి అలంకరించేందుకు పూలకు కూడా పైసలు లేకుండా ఉన్నారా..? అని కార్పొరేషన్ అధికారులను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా గోదావరిఖని ప్రధాన చౌరస్తా కు వచ్చిన ప్రతీ ఒక్కరు అమరవీరుల స్తూపం ను చూసి ఆవేదన వ్యక్తం చేశారు.