Dharmapuri | ధర్మపురి, నవంబర్ 22 : ధర్మపురి లో ప్రతీ శనవారం వారసంత జరుగుతుంది. అయితే గతంలో చింతామణి చెరువు కట్టపై, దేవాలయానికి, గోదావరికి వెల్లే రోడ్లపై మరియు ఖాళీ స్థలంలో వారసంత జరిగేది. ఇలా వారసంత నిర్వహించడం ఇటు రైతులకు, అటు వ్యాపారులతో పాటు వాహనదారులకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది.
నిత్యం దేవాలయానికి స్వామివారి దర్శనానికి పందలాది వాహనాల ద్వారా భక్తులు ఈ దారి గుండానే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దీంతో భక్తులు, వ్యాపారులు, రైతులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ఈశ్వర్ చొరవతో రైతులు, వ్యాపారులు ఆధునిక వ్యాపారం చేసుకునేలా రూ.4కోట్ల వ్యయంతో 80 వెజ్ స్టాల్స్, 24 నాన్‌వెజ్ స్టాల్స్ తోకూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఆధునిక హంగులతో నిర్మించి 2023 ఆగస్టు 3న ప్రారంభించారు. ఈ మార్కెట్లో రైతులు, వ్యాపారులు కొద్ది రోజులు క్రయవిక్రయాలు బాగానే నిర్వహించారు.
అయితే ఈ మార్కెట్లో లో నిర్మించిన స్టాల్స్ యొక్క గద్దెలు కొంచెం ఎత్తుగా ఉన్నాయనీ, కొనుగోలు దారునికి అమ్మకం దారునికి కొంత ఇబ్బందిగా ఉన్నదనే కారణంతో మార్కెట్‌ను వదిలి మునుపటి లాగే మళ్లీ రోడ్లపైకి వచ్చి అమ్ముకుంటున్నారు. రోడ్లపైనే వారసంత కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు పరస్పరం దాడులకు కూడా దిగుతున్న సంఘటనలు జరుతున్నాయి.
ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో స్కూళ్ల నుంచి వచ్చే సమయంలో అంబులెన్స్‌లు కూడా కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. అత్యవసర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహుళమంది వాడే రహదారులపై వరుసగా దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతి ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శనివారం వారసంత రోజున ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూడాలని కొందరు కోరుతున్నారు.
మార్కెట్ శాశ్వతంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి
రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించిన మార్కెట్ శాశ్వతంగా ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన మార్కెట్ నిర్మించిలా, చిన్నచిను సమస్యల కారణంగా మార్కెట్ ఉపయోగంలో లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇంటిగ్రేటిక్ మార్కెట్లో ఎత్తుగా ఉన్న గద్దెలను తొలగించి రైతులు, వ్యాపారుల సలహా మేరకు, వారికి అనుకూలంగా గద్దెలను నిర్మించి ఉపయోగంలోకి తీసుకువచ్చి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.