కమాన్‌చౌరస్తా, జనవరి 1: జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి సంబురాలు కొనసాగాయి. రాత్రంతా నగర యువత, ప్రజలు పెద్ద ఎత్తున చౌరస్తాలకు చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆయా పార్టీలు, సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. ఆయా ప్రాంతాల్లో న్యూ ఇయర్ కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో పాటు అధికారులను, ప్రజాప్రతినిధులను పలు సంస్థల ప్రతినిధులు, నిర్వాహకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొత్త ఏడాదిలో కొంగొత్త ఆశలతో, విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్-ప్రియాంక దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు..
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని సీఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చి, సీఎస్ఐ వెస్లీ చర్చి, లూర్దు మాత చర్చి, సెయింట్ మార్క్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన అల్ఫోర్స్ అధినేత
కలెక్టర్ ఆర్వీ కర్ణన్-ప్రియాంక దంపతులను అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలుగాలని ఆకాంక్షించారు. అలాగే, అధికారులను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మేయర్ క్యాంపు కార్యాలయంలో..
కార్పొరేషన్, జనవరి 1: నూతన సంవత్సరంలో నగర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని, వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు ఆకాంక్షించారు. భగత్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయ సిబ్బంది, పలు యూత్ క్లబ్‌ల సభ్యులు, డివిజన్ వాసులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో క్యాంపు సిబ్బంది ప్రకాశ్‌రావు, తిరుపతి, శ్రీనివాస్, సతీశ్, సాయి, బీఆర్ఎస్ నాయకులు కరీం, కన్నం శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, జిత్తు, బాలు, ధన్‌రాజ్, యూత్ క్లబ్ సభ్యులు హమీద్, అనిల్‌కుమార్, నరేందర్, విద్యాసాగర్, కిరణ్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో..
కలెక్టరేట్, జనవరి 1: నగరంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్-ప్రియాంక దంపతులను ఆదివారం జిల్లా ప్రభుత్వాధికారుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ దంపతులతో కేక్ కట్ చేయించారు. అలాగే, కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ పుష్పగుచ్ఛం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ప్రతినిధులు, టీఎన్జీవోల సంఘం జిల్లా శాఖ, తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ, అంధుల సంక్షేమ సంఘం జిల్లా శాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన 2023 సంవత్సర డైరీలు, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ దంపతులు బాలసదనంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. పిల్లలకు స్వయంగా కేక్ తినిపించి వారితో కాసేపు గడిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డి, కిరణ్, ప్రభుత్వాధికారుల సంఘం జిల్లా ప్రతినిధులు సీపీవో కొమురయ్య, డీఆర్డీవో ఎల్ శ్రీలత, సమాచార శాఖ అధికారి కొండయ్య, మార్కెటింగ్ డీడీ పద్మావతి, డీఎంహెచ్‌వో డా.జువేరియా, జిల్లా సంక్షేమాధికారి సబిత, సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
కొత్తపల్లి, జనవరి 1: జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఈవో జనార్దన్‌రావును ఆదివారం వారి కార్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి పోతన శ్రీనివాస్, పెటా టీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు అంతడుపుల శ్రీనివాస్, యూనిస్పాషా, పీడీ కనకం సమ్మయ్య, పీఈటీలు వీరన్న, హనుమంతు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ
హౌసింగ్‌బోర్డుకాలనీ, జనవరి 1: నగరంలోని కార్ఖానాగడ్డ వృద్ధాశ్రమంలో మహాత్మా జ్యోతీ బాఫూలే మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు పోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కోశాధికారి నంగునూరి ఎల్లయ్య, ఊకంటి రవీందర్, బాలరాజు, ఈశ్వర్, కుమార్, రాజయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు చేయూత
విద్యానగర్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్థానిక భగత్‌నగర్‌లో నిరుపేద విద్యార్థులకు ఆదివారం మేముసైతం యువసేన ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వప్న-శ్రీనివాస్ బుక్స్, పెన్నులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా పేద విద్యార్థులకు తమవంతు చేయూతనందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చతుర్వేది, వేద ప్రజ్ఞాన్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.