కోనరావుపేట, డిసెంబర్ 18: వ్యవసాయ భూముల కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. నిత్యం వేలాదిగా ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా, పట్టాదారు పుస్తకాల జారీ ప్రక్రియ ఆరు నెలలుగా ఆగిపోయింది. గతంలో ధరణిలో భూమి రిజిస్ట్రేషన్ జరిగిన వారం పదిరోజుల్లో పట్టా బుక్కు పోస్టులో ఇంటికి వచ్చేది. అయితే కొన్నాళ్లుగా పాసు పుస్తకాల జారీ ఆగిపోయి, కొత్తగా భూములు కొన్న రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులు అడిగితే రిజిస్ట్రేషన్ తర్వాత నేరుగా ఇంటికే పాసు పుస్తకాలు వస్తాయని చెబుతున్నా.. నెలలు గడిచినా రావడం లేదు. అసలు బుక్కులు వస్తయా.. రావా..? స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. ఒరిజినల్ పాస్‌బుక్‌లు ఉంటేనే బ్యాంకుల్లో రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తేల్చి చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అటు రెవెన్యూ, ఇటు తపాలా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
నేను కోనరావుపేట తహసీల్ ఆఫీస్‌లో మూడు నెలల కింద ధరణి ద్వారా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లకు ముందే మా తమ్ముడి పేరుమీదున్న భూమి నా పేరు మీద ఎక్కింది. నాకు పట్టా పాస్ బుక్ జిరాక్స్ ఇచ్చిన్రు. ఒరిజనల్ పాస్ బుక్ పోస్ట్‌లో ఇంటికి వస్తుందని అన్నరు. మూడు నెలలైతంది. ఇంకా రాలె. బుక్కు వస్తే బ్యాంకులో లోను తీసుకుందామని అనుకున్న. ఏం పాయిదా లేదు. ఇప్పటి వరకు చాలా సార్లు తహసీల్ ఆఫీస్‌కు వెళ్లి అడిగిన. పోస్టులోనే పాస్ బుక్ వస్తదని చెబుతున్నరు. అధికారులను అడిగితే పోస్టులో ఇంటికే వస్తదని అంటున్నరు. వాటి గురించి మరే సమాచారం తెలియదని చెబుతున్నరు. పాసు బుక్కు వస్తదో.. రాదో..? తెలియడం లేదు.
– కాతుబండ చిన్న మల్లేశం, రైతు(మామిడిపల్లి)