పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉపాధ్యాయులకు కొత్త చిక్కులొచ్చి పడుతున్నాయి.
ముందుగా అంగీకరించిన వారిలో కొంత మంది ఇప్పుడు వెనుకడుగు వేస్తుండడం.. మరికొంత మంది కొత్త
కండీషన్లను తెరపైకి తెస్తుండడంతో కథ అడ్డం తిరుగుతున్నది. అంతా అయిపోయిందనుకునే సమయంలో
రోజుకో ట్విస్ట్‌తో సదరు టీచర్లలో ఉత్కంఠ నెలకొంది. ఎలాగూ ఈ నెల 31లోగా రిటైర్డ్ అవుతున్నామని
భావించిన కొంత మంది పంతుళ్లు.. ముందుగా డబ్బులు తీసుకొని పరస్పర బదిలీల్లో ఎంత దూరమైనా
వెళ్లేందుకు ఓకే చెప్పినా.. ప్రస్తుతం వయోపరిమితి పెంపుపై వస్తున్న వార్తల నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
మరికొంత మంది ఈనెల 31లోగా పరస్పర బదిలీలు కాకపోయినా తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని, అందుకు అంగీకరిస్తేనే అండర్‌టేకింగ్ పత్రం డీఈవో కార్యాలయంలో ఇస్తామంటూ కొత్త కండిషన్ పెడుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా పరస్పర బదిలీల్లో కథ అడ్డం తిరిగిందనడానికి ఇవే నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ప్రస్తుతం ఈ చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశమిచ్చింది. అందులో భాగంగా డిసెంబర్ ఒకటి నుంచి 31 వరకు దరఖాస్తులు సమర్పించుకునే వీలు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 925 మంది ఉపాధ్యాయలు పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 104 మంది దరఖాస్తు చేశారు. వీరిలో జగిత్యాల జిల్లా నుంచి 17 మంది, కరీంనగర్ 62, పెద్దపల్లి 16, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 9 మంది ఉన్నారు. అయితే తాము కోరుకున్న చోటికి రావడానికి కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంత మొత్తం వెచ్చించడానికైనా వెనుకాడడం లేదని తెలుస్తున్నది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒక్కో ఉపాధ్యాయుడు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది అయితే ఏకంగా 12 లక్షల వరకు కూడా వెచ్చించడానికి ముందుకొచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ పరస్పర బదిలీల్లో దాదాపు 5కోట్లపై చిలుకు ఇప్పటికే చేతులు మారినట్టు, అందుకు సంబంధించి ఒప్పందాలు పక్కాగా జరిగినట్టు తెలుస్తున్నది. కాగా, పరస్పర బదిలీల విషయంలో దరఖాస్తుదారుడు-1, దరఖాస్తుదారుడు-2 (అప్లికెంట్1, అప్లికెంట్-2) నుంచి అండర్‌టేకింగ్ పత్రాలను తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ పత్రాలను ఈనెల 17 నుంచి 22 వరకు సదరు ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని చెప్పింది. ఈ పత్రాలను సేకరించి, ఆ జాబితాను పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
పరస్పర బదిలీలు అవుతాయని అందరూ భావిస్తున్న సమయంలో ప్రస్తుతం కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కథ అడ్డం తిరుగుతున్నది. నిజానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులు.. పట్టణప్రాంతాలకు వచ్చేందుకు ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ఈనెల 31న రిటైర్డ్ అయ్యే టీచర్ల వివరాలను తెలుసుకొని, వారితో ఒప్పందం చేసుకొని డబ్బులు అప్పగించినట్టు తెలుస్తున్నది. ‘ఎలాగూ ఈనెల 31తో రిటైర్ అవుతున్నాం. ఉద్యోగ విరమణ ఎక్కడైతే ఏంటి?’ అన్న కోణంలో ఆలోచించిన సదరు పంతుళ్లు, పరస్పర బదిలీల్లో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది.
ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా కథ అడ్డం తిరుగుతున్నది. ప్రధానంగా ఇటీవల ఉద్యోగుల వయో పరిమితి పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న వార్తలు వస్తున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఓ ఫైల్ కదుపుతున్నదని, అందుకు కావాల్సిన వివరాలు సేకరిస్తున్నదన్న వార్తలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నిజంగానే వయో పరిమితి పెంచితే.. పరస్పర బదిలీల్లో తాము దూరం వెళ్లిన చోటే ఉద్యోగం చేయాల్సి వస్తుందన్న భయంతో ముందుగా అంగీకారం తెలిపిన చాలా మంది పంతుళ్లు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇదే సమయంలో పరస్పర బదిలీల ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలుపాల్సి ఉండగా, సీఎం విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయన్న చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. ఒకవేళ ఈ నెల 31లోగా ఈ ఫైలుకు ఆమోద ముద్ర లభించకపోతే ఏమిటన్న ప్రశ్నలు పలువురు టీచర్లలో ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఒప్పందం చేసుకున్న ఉపాధ్యాయులు.. ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చినట్టు తెలుస్తున్నది. చేసుకున్న ఒప్పందం ప్రకారం అండర్ టేకింగ్ ఇవ్వాలంటే.. ఈ నెల 31లోగా బదిలీలకు ఆమోద ముద్రపడినా.. పడకపోయినా సరే తమకిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని, ఆ షరతుకు ఓకే అయితేనే అండర్‌టేకింగ్ ఇస్తామని చెబుతున్నట్టు తెలుస్తున్నది.
దీంతో ఔత్సాహిక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. ఒకవేళ 31లోగా పరస్పర బదిలీలు జరక్కపోతే రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారుతుందన్న ఆందోళన కనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ విషయం విద్యాశాఖలో హాట్‌టాపిక్‌లా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంత మంది అండర్‌టేకింగ్ పత్రాలు ఇస్తారో ఈ నెల 22 తర్వాత తెలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.