New courts | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 6 : కక్షిదారుల సౌలభ్యం కోసమే నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా సత్వర న్యాయం అందుతుందని హైకోర్టు న్యాయమూర్తి, పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి లక్ష్మినారాయణ అలిశెట్టి అన్నారు. సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో నూతనంగా మంజూరైన అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ను శనివారం హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, పుల్ల కార్తీక్, జే శ్రీనివాస రావు ప్రారంభించారు.
జ్యోతి ప్రజ్వలన అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ కోర్టుల్లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా నూతన కోర్టులకు జడ్జిలను నియామకం చేస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కల్పించేలా న్యాయవాదులు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో విశాలమైన స్థలం ఉందని సబ్ కోర్టు, జిల్లా కోర్టును సుల్తానాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం అందజేశారు.
అంతకుముందు న్యాయమూర్తులను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత కుంచాల, అదనపు జిల్లా జడ్జి టీ శ్రీనివాస రావు, జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్, జిల్లాలోని పలు కోర్టుల న్యాయమూర్తులు, రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయుని భూమయ్య, ఏపీపీ శ్యాం ప్రసాద్ రావు, ఏజీపీ దూడం ఆంజనేయులు, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, న్యాయవాదులు దివాకర్ రావు, మాధూరి ఆంజనేయులు, బాలకిషన్ ప్రసాద్, శ్రీనివాసరావు, పడాల శ్రీరాములు, అకారపు సరోత్తం రెడ్డి, వొడ్నాల రవీందర్, ఆవునూరి సత్యనారాయణ, ఆవుల శివకృష్ణ, సామల రాజేంద్ర ప్రసాద్, గుడ్ల వెంకటేష్ లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.