‘రైతు బీమా’పై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకంపై చిన్నచూస్తున్నది. ఈ ఏడాది ప్రీమియం చెల్లింపులో భాగంగా జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మూడు రోజులే గడువు ఇచ్చింది. 9వ తేదీన ప్రకటించి ఈ నెల 13 తేదీ వరకే అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పడం, పత్రికల్లో ప్రకటనలు తప్ప ఏ మాత్రం సమాచారం ఇవ్వకపోడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నేటి అర్ధరాత్రి నుంచే పథకం అమల్లోకి రాబోతుండగా, పనులన్నీ వదిలి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
కరీంనగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రైతులు ప్రమాదవశాత్తూగానీ, సహజంగా గానీ మరణిస్తే 5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తెచ్చింది. 2018 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచే అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకం అమలుకు ముందు చాలా రోజులే కసరత్తు చేసింది. రైతుల ఇండ్లకు వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది.
నెల పాటు వ్యవసాయ అధికారులు రైతుల ఇంటికే వెళ్లి వారికి కావాల్సిన దరఖాస్తులు, ఫొటోలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, నామినీ ఆధార్ కార్డులు, బ్యాంక్ పాసు పుస్తకాలు సేకరించగా, రైతులకూ ఎక్కడా ఇబ్బందులు రాకుండా పోయాయి. సులువుగా పథకం అమలులోకి వచ్చింది.
60 ఏండ్లలోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తించేలా ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ఏటా ఆగస్టు 12 వరకు ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. ఏటా కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందే రైతుల్లో అర్హులు ఉంటే వారికి కూడా వర్తించేలా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అందుకోసం అధికారులను నెల రోజుల ముందే అప్రమత్తం చేసేది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పథకం లక్ష్యాలను నీరుగార్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి.
ఇంత త్వరగా దరఖాస్తులు ఎలా..?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2023 ఆగస్టు 12వరకు రైతు బీమాకు ప్రీమియం చెల్లింపు జరిగింది. 2024-25లో ప్రస్తుత ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేవని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా.. లేదా.. ? అనే సందిగ్ధం వ్యక్తమైంది. ఎట్టకేలకు ఈ నెల 9న రైతు బీమా కోసం దరఖాస్తులు స్వీకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.
ఆ మేరకు ఈ నెల 13 వరకు సంబంధిత ఏఈఓలకు దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చే ఈ పథకానికి.. జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొంది, 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య కాలంలో జన్మించిన రైతులు అర్హులని అధికారులు ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇంత త్వరగా కొత్త రైతులకు ఎలా తెలుస్తుందనేది సందేహం.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన అనేక మంది రైతులకు ఇప్పటికే రైతు భరోసా పథకం వర్తించలేదు. ఇపుడు సెలవు రోజైన శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత మరుసటి రోజు ఆదివారం కూడా సెలవే కావడం, సోమ, మంగళ, బుధవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో రైతులు అధికారుల వద్దకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.
రైతులది ఏమీ చేయలేని పరిస్థితి
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య రైతు భరోసా సమయంలో 14 వేలకుపైగానే ఉన్నట్టు తెలుస్తున్నది. అందులో అర్హులు కనీసం 8 వేల వరకు ఉండవచ్చని అంచనా. వీరిలో ఈ మూడు రోజుల్లో ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారనేది సందేహమే. రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలతోపాటు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఈ సమాచారం అర్హులైన చాలా మంది రైతులకు చేరలేదు. పత్రికా ప్రకటనలు మినహా అధికారులు విస్తృత ప్రచారం చేయలేదు.
ఈ నేపథ్యంలో చాలా మంది రైతులకు తెలిసే అవకాశాలు చాలా తక్కువ. తెలిసిన రైతులు సంబంధిత ఏఈవోల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్న తర్వాత రైతు బీమా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైతులు దరఖాస్తులు చేసుకున్నా ఈ నెల 13 అర్ధరాత్రి వరకు సంబంధిత పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయకున్నా, చేయడంలో ఆలస్యం జరిగినా రైతు బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఈ పథకానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.