చొప్పదండి, ఆగస్టు 10 : రైతులకు ఒక వేదిక ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం చూపుతున్నది. నిర్వహణకు బిల్లులు చెల్లించకపోవడంతో అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తున్నది. రైతులుతమ అవసరాలు తీర్చుకునేలా, సాగులో మెళకువలు తెలుసుకునేలా, వ్యవసాయాభివృద్ధిలో రాణించేందుకు సలహాలు, సూచనలు పంచుకోవడానికి క్లస్టర్ల వారీగా ఈ వేదికలు నిర్మించారు. ఒకో వేదిక కోసం రూ.22 లక్షల చొప్పున కోట్లాది రూపాయలు వెచ్చించారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని చొప్పదండి మండలంలో 5, రామడుగులో 6, గంగాధరలో 5, కొడిమ్యాలలో 4, మల్యాలలో 4, బోయినపల్లిలో4 చొప్పున మొత్తం 28 ఉన్నాయి. అందులో పెద్ద సమావేశపు హాల్, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక గది, అధికారులు, రైతుల కోసం కుర్చీలు, బల్లలు, మైక్‌సెట్‌తో పాటు టీవీ, నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం కల్పించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతినెల వాటి నిర్వహణకు 9 వేలు సైతం అందించింది. రైతు వేదికల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందించేవారు. అంతేగాక ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ ఏఈవోని నియమించడంతోపాటు వారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చులు ఇవ్వడం లేదని సమాచారం. దీంతో సంబంధిత అధికారులు తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. నిర్వహణ ఖర్చులు రోజురోజుకూ పెరిగి అదనపు భారం మీద పడడంతో వ్యవసాయశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.