Neerukulla | సుల్తానాబాద్ రూరల్, జనవరి 26 : ఐదేళ్లపాటు వచ్చే సర్పంచ్ జీతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాలకు అందిస్తానని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సర్పంచ్ కాంపల్లి సతీష్ తన సొంత డబ్బులతో రూ.25 వేలు వెచ్చించి సోమవారం స్పోర్ట్స్ దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దాసరి సతీష్, హెచ్ఎం, వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులున్నారు.