ఆది నుంచీ బీఆర్ఎస్ వెంటే నడుస్తున్న కరీంనగర్ పార్లమెంట్ మరోసారి అధినేత కేసీఆర్‌కు జైకొట్టింది. రాబోయే లోక్‌సభ నియోజకవరం ఎన్నికలకు ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా శంఖారావం పూరించగా, ప్రజానీకం మద్దతు తెలిపింది. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అశేషంగా తరలివచ్చింది. కదనభేరి సభ విజయవంతం కావడం, అధినేత ప్రసంగం ఉర్రూతలూగించడం, నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంతో గులాబీదళం నయా జోష్ నింపుకొన్నది. ఈ నూతనోత్తేజంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించే దిశగా సాగిపోతున్నది. సమర్థుడైన బోయినపల్లి వినోద్‌కుమార్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నది.
కరీంనగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ పార్లమెంట్ ఆది నుంచీ బీఆర్ఎస్ వెంటే ఉంటున్నది. పార్టీ ఆవిర్భావం మొదలు.. నేటి వరకు ఏ కార్యక్రమం తీసుకున్నా జై కొడుతున్నది. అధినేత కేసీఆర్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తున్నది. నాడు 2014 ఏప్రిల్ 13న ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించగా, పార్టీకి అద్భుత విజయాన్ని అందించింది.
ఇప్పుడు అదే నేల నుంచి రాబోయే లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరించగా, మరోసారి తాము గులాబీ పార్టీ వెంటే ఉన్నామని చాటి చెప్పింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన కదనభేరికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజానీకం అశేషంగా తరలివచ్చి జైకొట్టింది. నిజానికి సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ఉండగా.. అప్పటికే పెద్ద సంఖ్యలో రావడంతో సభా ప్రాంగణం నిండిపోయింది.
అయితే, సభ రెండు గంటలపాటు ఆలస్యమైనా ఆసక్తిగా.. ఉత్సాహంగా ఎదురుచూసింది. అధినేత కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోగానే ‘జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగించింది. తర్వాత పార్టీ ఆవిర్భావం, ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయం, స్వరాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర సాధన, పదేళ్ల బీఆర్ఎస్ సంక్షేమ పాలనపై కేసీఆర్ వివరించిన తీరును చూసి సభికులు జేజేలు పలికారు.
అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కండ్లముందుంచగా.. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. గులాబీ జెండానే తెలంగాణకు నిజమైన రక్షణ అని తేల్చి చెప్పడంతో సభాప్రాంగణమంతా జై తెలంగాణ నినాదాలతో ప్రతిధ్వనించింది. ‘మళ్లీ వెనక్కి పోదామా.. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని ముందుకు పోదామా’ అని ప్రశ్నించగా.. గులాబీ జెండాను ఎగురవేద్దామని స్పష్టం చేసింది.
ఆది నుంచీ వెంటే..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నది. ఏడింటిలో నాలుగు స్థానాలు కోల్పోయి, మూడు స్థానాల్లో విజయ బావుటాను ఎగుర వేసిన గులాబీ పార్టీ.. కాంగ్రెస్ కంటే అధికంగా ఓట్లు సాధించింది. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువగా, హుస్నాబాద్, చొప్పదండి, వేములవాడ, మానకొండూర్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ, ఓట్ల పరంగా చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థులే ఎక్కువగా సాధించారు. పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని నాయకులు చెబుతున్నారు. ఆ అభిమానంతోనే ఇప్పుడు కదనభేరి సభకు పెద్ద సంఖ్య లో తరలివచ్చి విజయవంతం చేశారని అంటున్నారు.
కార్యకర్తల్లో నూతనోత్సాహం
కరీంనగర్ నేల నుంచి కదనభేరి మోగించడం బీఆర్ఎస్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న కార్యకర్తలను సమరశీలురుగా తీర్చిదిద్దేలా అధినేత ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. ఉద్వేగ పూరితంగా.. మళ్లీ ఉద్యమభాషతో ప్రసంగించడం జనాన్ని ఉర్రూతలూగించడమే కాదు, శ్రేణుల్లో జోష్ నింపుతున్నది. తొమ్మిదేండ్ల తమ పాలన, మూడు నెలల కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో కండ్లకు కట్టినట్లు వివరించిన తీరు, ప్రతి కార్యకర్తా అంకుశమై నిలువాలని ఇచ్చిన పిలుపు ప్రభావాన్ని చూపుతున్నది. కీలక అంశాలపై ఆయన మాట్లాడడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
సభకు పెద్ద సంఖ్యలో రావడం, ప్రజల నుంచి ఏ మాత్రం ఆదరణ తగ్గకపోవడం, అధినేతకు జేజేలు పలుకడం చూసి గులాబీ నాయకులు, కార్యకర్తలు నయాజోష్‌లో మునిగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలోనే పార్లమెంట్లో తెలంగాణ గొంతుక ఉండాలని పిలుపునివ్వడంతో ప్రతి కార్యకర్త నూతనోత్తేజంతో ముందకు సాగుతున్నారు. తాము ప్రజల పక్షమని చెప్పేందుకు వచ్చిన ఈ సభే రుజువని, రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సోయి ఉన్న నాయకుడు ఉండాలి
2001లో ఉద్యమం ప్రారంభించినప్పుడు నేను కూడా కేసీఆర్‌తో ఉన్న. వేళ్ల మీద లెక్కించే వారిలో నేనూ ఒకడిని. చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్‌కు దశాబ్దకాలంగా ప్రజలు అండగా ఉన్నరు. కాంగ్రెస్ ఆడిన కపట నాటకంతో ఇటీవల ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి, అభివృద్ధికి బ్రేకులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే కేసీఆర్ సర్కారు అమలు చేసిన ప్రజా, రైతు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేస్తున్నది.
ఇలాగే కొనసాగితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు ఏం జరుగుతుందోననే ఆందోళన తెలంగాణ ప్రజల్లో ఉన్నది. అభివృద్ధిని కొనసాగించాలంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పార్లమెంట్లో లేవనెత్తే మన తెలంగాణపై సోయి ఉన్న నాయకుడు ఉండాలి. ఈ ప్రక్రియను తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అయితేనే నిబద్ధతతో పూర్తి చేయగలుగుతడు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నిలబడాలంటే ఆయన గెలవాలి.
– వానపట్ల నర్సింహారెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, అనుపురం, (వేములవాడరూరల్ మండలం)
కేసీఆర్‌తోనే భరోసా
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాకు భరోసా ఇచ్చిండు. రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, కరెంటు ఇబ్బందులు లేకుండా చేసిండు. ఇప్పుడు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నయి. కేసీఆర్ సర్ ఏదో విధంగా పంటలకు మాత్రం సాగునీరు అందించిన్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు కాళేశ్వరంలో సమస్య వచ్చిందని నీళ్లు ఇచ్చుడే లేదు. అదే కేసీఆర్ సర్ ఉంటే ఏదో విధంగా సాగునీరు వచ్చేవి. ఉద్యమ సమయంలో కరీంనగర్లో సభ జరిగినట్లే ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు ముందు ఈ సభ జరిగింది.
– అల్లాడి శ్రీనివాస్, వేములవాడ