గంగాధర, ఆగస్టు 20 : ముంపు గ్రామంగా ప్రకటించాలని గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం మధురానగర్ చౌరస్తాలో భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్‌తో తాము అష్ట కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి జాలు, పాములు, విషకీటకాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు వాపోయారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా, భిక్షాటన చేస్తుండగానే ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వారికి స్థానికంగా ఉన్న ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బాధిత మహిళలను పరామర్శించారు. మహిళలకు మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. గ్రామస్తులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాగా, గ్రామస్తులు ధర్నా చేసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.