ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజులపాటు వందలాది మందితో రాజరాజేశ్వర కళ్యాణ మండపం కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ సంస్థలు, బ్యాంకులు స్టాళ్లు ఏర్పాటు చేయగా, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్లు, విల్లాల ధరలతోపాటు వ్యాపారాలు, భూములు, ఇండ్ల కొనుగోలుకు అందిస్తున్న రుణాల గురించి తెలుసుకున్నారు. అలాగే, సోలార్ విద్యుత్‌కు సంబంధించిన వివరాలను సేకరించారు. పలువురు నిర్మాణాలు, స్థలాల కోసం అడ్వాన్స్‌లు చెల్లించగా, స్పందనను చూసి వ్యాపార సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్, మార్చి 9: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. కోర్టు చౌరస్తా సమీపంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో శని, ఆదివారాల్లో ఈ ఎక్స్పో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ రియల్ సంస్థలు, నిర్మాణ రంగానికి సంబంధించిన సోలార్, సిమెంట్, వుడ్‌కు సంబంధించిన సంస్థలు, రుణాలు అందించే బ్యాంకుల ప్రతినిధులు, బిల్డర్స్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు షో నిర్వహించగా, రెండు రోజుల్లో 1200కు పైగా సందర్శకులు స్టాళ్లను సందర్శించారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో తరలివచ్చారు.
నిర్మాణ రంగ సంస్థల ఉత్పత్తులు, ప్రాజెక్టులు, వ్యయాలు, లోన్లు ఇతర వివరాలను తెలుసుకున్నారు. కొందరు ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లను బుక్ చేసుకొని అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. ప్రజలతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వచ్చి స్టాళ్లను పరిశీలించారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, బండ గోపాల్‌రెడ్డి హాజరయ్యారు. రెండోరోజు షోను సందర్శించిన ప్రజలకు లక్కీ డ్రా ద్వారా ఐదుగురికి ఉచితంగా బహుమతులను అందించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావు, ఎడిషన్ ఇన్చార్జిలు ఐ సుభాష్, సంపత్, యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, నమస్తే తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాల సమాచారం, నిర్మాణ రంగంలో ఎదురయ్యే సమస్యలు, బ్యాంకు రుణాలు, వాటి వడ్డీ గురించి ప్రజలు తెలుసుకునేందుకు రియల్ సంస్థలు, బ్యాంకర్లను నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఒకే వేదిక మీదకు తీసుకురావడం అభినందనీయం. ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో వచ్చే వివిధ సందేహాలను ఇక్కడి స్టాళ్లలో అడిగి తెలుసుకోవచ్చు.
– బండ గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు
ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని అనుమతులు ఉంటేనే కొనాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించారా..? లేదా అని సరిగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేస్తేనే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా రియల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లాలోనూ రియల్ రంగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రియల్ సంస్థలు, నిర్మాణ రంగానికి అవసరమైన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలాంటి వేదికతో కొనుగోలుదారులకు ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని షోలు నిర్వహించాలి.
– ఆంజనేయులు, డీటీసీపీ అధికారి