‘మాది సాధారణ రైతు కుటుంబం. కాయకష్టం చేసుకుంటూ బతికేటోళ్లం. ఊళ్లో తప్ప బయటి ప్రపంచం ఎట్లుంటదో తెలువది. ఎన్నడూ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కలే నేను. కానీ, భూ కబ్జా చేశానంటూ నాపై అక్రమ కేసు పెట్టిన్రు. అప్పటికే గొంతు ఆపరేషన్ చేయించుకొని మాట్లాడలేని స్థితిలో ఉన్న నన్ను జైలుకు పంపి మానసికంగా వేధించిన్రు’ అంటూ’ తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డి వాపోయాడు. ఈ మేరకు శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని తనపై ఎలాంటి విచారణ జరపకుండానే అక్రమంగా కేసులో ఇరికిస్తే ‘నేనున్నానంటూ’ కేటీఆర్ అండగా నిలిచారని, బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చారని పేర్కొన్నాడు. ఐదు రోజులు జైలులో నిద్రాహారాలు లేకుండా గడిపిన తనకు సొంత అన్నలా భరోసాగా నిలిచిన దేవుడు కేటీఆర్కు చేతులెత్తి మొక్కుతున్నామంటూ కృతజ్ఞతలు తెలిపాడు. భూమికి సంబంధించి కేసు పూర్వపరాలు ఆయన మాటల్లోనే..
రాజన్న సిరిసిల్ల, మార్చి 1(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్ : “జిల్లెల్లలో నాకు మూడెకరాల పట్టాభూమి, మా నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన 30 గుంటల అసైన్డ్ భూమి ఉంది. సర్వే నంబర్ 1183/4/1/1లోని దంతె మల్లయ్యకు చెందిన 30 గుంటల అసైన్డ్ భూమిని యాదవులు కొనుగోలు చేసిన్రు. వారి నుంచి మా నాన్న అబ్బాడి నారాయణ కొనుగోలు చేసిండు. ఆ భూమి పక్కనే సర్వే నంబర్ 1173/1 లో 3 ఎకరాల పట్టాభూమి ఉన్నందున రెండు కలిపి సాగు చేసుకుంటూ వస్తున్నం. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 2017లో రెవెన్యూ అధికారులు మా ఇంటికి వచ్చిన్రు. 30 గుంటల అసైన్డ్ భూమిలో సాగు చేసుకున్న వివరాలను సేకరించిన్రు. వాస్తవానాకి 30 గుంటల అసైన్డ్ భూమిని చాలా ఏండ్ల క్రితం యాదవుల నుంచి కొనుగోలు చేసిన్రు. యాదవులు కూడా ఎస్సీల నుంచి కొనుగోలు చేసుకుని, తర్వాత మా నాన్నకు అమ్మిన్రు. దీంతో ఆస్తి పంపకాల్లో భాగంగా రద్దు బదులు ద్వారా నాకు 30 గుంటల భూమి రాగా, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్న. 2017లో కేసీఆర్ సర్కార్ భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారులు నా భూమిని సర్వేచేసి, కబ్జాలో ఎవరు ఉన్నారని విచారణ చేసిన్రు. భూమిని అమ్మిన దళితుల వాంగ్మూలం తీసుకుని, అధికారులు నాకు ప్రొసీడింగ్ ఇచ్చిన్రు. తర్వాత కొత్త పట్టాదారు పాస్ బుక్ అందించి, రైతు బంధు సహాయం సైతం అందించారు. అప్పటి నుంచి వరిసాగు చేసుకుంటున్న.
మోకాపై ఉన్న భూమిపై రెవెన్యూ అధికారులే విచారణ జరిపి పట్టా పాసుబుక్కు ఇస్తే కబ్జా ఎలా? అవుతుందో వాళ్లే చెప్పాలి. అసైన్డ్ భూమి పట్టా చేసుకోరాదని అధికారులు చెబితే అప్పుడే వదులుకునే వాడిని. నాకు చట్టాల గురించి తెలియదు. అధికారులు ఇచ్చిన పట్టాతో సాగు చేసుకుంటున్న. నాపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు. అసైన్డ్ భూ ములు అనేక మందికి ఉన్నయి. నాపైనే ఎందుకు కేసుపెట్టారో అర్థం కావడం లేదు. సమాచారం ఇవ్వకుండానే పోలీసు ఇంటికి వచ్చి స్టేషన్కు తీసుకెళ్లిండు. నాకు ఆపరేషన్ అయ్యిందని చెప్పినా వినలే. రిమాండ్కు తరలించడం సరైందికాదని వైద్యులు రిపోర్టు ఇస్తామని చెప్పినా కానిస్టేబుల్ వినలే. కానిస్టేబుల్ అతని ఉన్నతాధికారితో వైద్యుడికి ఫోన్ చేయించి రిపోర్టు వేరే విధంగా రాయించి జైలుకు పంపించిండు.
అన్యాయంగా అధికారులు జైలుకు పంపితే కేటీఆర్ దేవునోలె నన్ను బెయిల్పై బయటకు తెచ్చి, సొంత అన్నలా కొండంత ధైర్యం ఇచ్చిం డు. పైసా ఖర్చులేకుండా కోర్టు ఖర్చులన్నీ సారే పెట్టుకున్నడు. గొంతు ఆపరేషన్ చేసుకుని ముద్ద మింగలేకున్న నేను ఐదు రోజులు జైల్లో నరకం చూసిన. నేను ఏ తప్పు చేయకున్నా జైలుకు పంపించడంతో మానసికంగా కుంగిపోయిన. కేటీఆర్ అండగా నిలువడం వల్ల ధైర్యం తెచ్చుకున్నా. బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను పరామర్శించి మరింత భరోసా కల్పించిన్రు.” అంటూ రాజిరెడ్డితో పాటు ఆయన భార్య లత ఈ సందర్భంగా కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు రుణపడి ఉంటామన్నారు. కాగా, తనకు భూమి లేకు న్నా పర్వాలేదని, సమాజంలో పరువుతో ఉన్న తనపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని రాజిరెడ్డి కోరాడు.