కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 22 : మన కరీంనగర్లో ఆటో షో.. అట్టహాసంగా ప్రారంభమైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం మొదలైన ఈ రెండు రోజుల ఎక్స్పో.. మొదటి రోజు ఫుల్ రష్‌గా మారింది. పొద్దంతా ఎండ ప్రభావం కనిపించినా.. మధ్యాహ్నం తర్వాత నుంచి తాకిడి మొదలైంది. సాయంత్రానికి మరింత పెరిగి, రాత్రి దాకా 9 గంటల వరకూ రద్దీ కనిపించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు స్టాళ్లన్నీ తిరుగుతూ.. సరికొత్త వాహనాలను ఆసక్తిగా పరిశీలించారు. ప్రముఖ కార్లు, బైక్‌ల మోడళ్లు, అందులో ఫీచర్లు, వాటి ధరల గురించి తెలుసుకున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను బుక్ చేశారు. దాదాపు పదికిపైగా కార్లు బుక్ చేసుకున్నారు.

అయితే, పేపర్ ప్రాసెస్ లేట్ కావడంతో రెండు మూడు రోజుల్లో డెలివరీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. రెండు కార్లను మాత్రం డెలివరీ చేశారు. అలాగే, బైక్‌లను అక్కడికక్కడే డెలివరీ చేశారు. కొనుగోలుదారులకు ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో వాహిని షాపింగ్ మాల్ కూపన్లు అందజేశారు. ఆటోషోను చూసి సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే వేదికపైకి కరీంనగర్లో లేని కంపెనీలను తీసుకురావడం అభినందనీయమని, అలాగే ఎన్నో ప్రముఖ వాహనాల గురించి ప్రత్యక్షంగా టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకునే అవకాశం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే సందర్శకుల స్పందన, బుకింగ్‌లు, డెలివరీలను చూసి నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

టొయాటోలో ప్రీమియం సెగ్మెంట్లో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువ మంది కస్టమర్లు వీక్షించి వివరాలు తెలుసుకున్నారు. భారీ వాహనాలు కూడా మధ్య తరగతి వారికి అందుబాటులో ధరలో ఉన్నాయి. హైడర్, టైసర్, గ్లాన్జా, రుమైన్ వంటి వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆటో షో ద్వారా ప్రజల్లోకి వెళ్లే మంచి అవకాశం మాకు లభించింది. ఇలాంటి ఆటో షోలు మరిన్ని నిర్వహించాలి.
– అనిల్‌రెడ్డి, కాకతీయ టోయాటో
ఎంజీ కంపెనీ నుంచి వచ్చిన అనేక ఈవీ మోడల్ వాహనాలకు మారెట్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇందులో ఒక చార్జితో 230, 450కిలో మీటర్ల మైలేజ్ వచ్చే వాహనాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వాసులు వాహనాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 30మంది కొత్త వినియోగదారులు మమ్మల్ని ఆశ్రయించారు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులు, వినియోగదారులకు కృతజ్ఞతలు.
– రియాజ్, ఎంజీ మోటార్స్
ఇప్పుడున్న మార్కెట్లో మా వద్ద ఉన్న ఈవీ వాహనాలు పెద్ద సంఖ్యలో మార్కెట్లో ఉన్నాయి. మేం రూ.40వేలకే ఈవీ వాహనాలు కస్టమర్లకు అందిస్తున్నాం. రూ.40వేల నుంచి రూ.1.2లక్షల వరకు వాహనాల కొనుగోలుకు సంఖ్యలో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. సుమారు 45-50మంది మా స్టాల్స్ సందర్శించారు. ఇలాంటి వేదికలు జిల్లా కేంద్రంలో మరిన్ని ఏర్పాటు చేయాలి.
– వేణుగోపాల్ రెడ్డి గూటం, బీఏవీ మోటార్స్
మార్కెట్లో సెవన్ సీటర్ ఈవీ వాహనాలలో కెరెన్స్ క్లావిస్ ప్రత్యేకం. ఈవీ వేరియంట్లో 490 ఆపై మైలేజ్ ఇవ్వడం కియా మోటర్స్ సొంతమని చెప్పవచ్చు. ఈ క్రమంలో కియా కార్ల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మిడ్ ఎస్ఈవీలలో చాలా విలాసవంతంగా ప్రయాణించే కార్లలో క్లావిస్తో పాటు సెల్టాస్కు మంచి గుర్తింపు ఉంది. ఈ షో ద్వారా చాలా మంది మా స్టాల్‌ను సందర్శించారు. కొనుగోలుకు ఆసక్తిచూపారు. బుకింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.
– కరుణ కుమార్, మాలిక్ కియా
బీఎండబ్ల్యూలో ప్రీమియం వేరియంట్లో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. రూ.50లక్షల నుంచి ఈవీ వాహనాలు రూ.2.3కోట్ల వరకు అందిస్తున్నాం. మా వద్ద ఉన్న ఐఎక్స్ 1, ఐఎక్స్3, ఐఎక్స్5, ఐఎక్స్ 7 వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఉన్నత శ్రేణికి చెందిన కస్టమర్లు ఈ వాహనాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నరు. ఈ షో ద్వారా పెద్ద సంఖ్యలో సందర్శకులు మా వాహనాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. లగ్జరీ సెగ్మెండ్ వాహనాలు కావడంతో ఫొటోలు దిగడానికి, టెస్ట్ డ్రైవ్ చేయడానికి ముచ్చటపడ్డారు.
– ఎంఏ చౌదరి, కున్ ఎక్స్‌క్లూజీవ్ బీఎండబ్ల్యూ
నెక్సా వాహనాలకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్నది. పెద్ద సంఖ్యలో ఈ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రెండేండ్లలో దాదాపు రెండు లక్షలకుపైగా వాహనాలు మన దేశంలో విక్రయించాం. ఇందులో గ్రాండ్ విటారాకు భలే డిమండ్ ఉన్నది. పెద్ద సంఖ్యలో వాహనదారులు ఈ వాహనం వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ షో ద్వారా వాహనాలు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్లు సైతం అందిస్తున్నాం. దీంతో చాలా మంది సందర్శకులు ఆసక్తి చూపుతూ, ఆఫర్ల గురించి తెలుసుకుంటున్నారు.
– శివ ధర్మ, ఆదర్శ నెక్సా