‘జగిత్యాలలో భూమాయ!’ కథనం సంచలనం సృష్టించింది. నలభై ఆరేళ్ల క్రితం కొన్న భూమిని తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని ఈ నెల 4న ‘నమస్తే’ వెలుగులోకి తేవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏకంగా రాష్ట్ర ఏసీబీ యంత్రాంగాన్ని కదిలించింది. దీంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు, మంగళవారం జగిత్యాల మున్సిపాలిటీలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో అనేక అవకతవకలతోపాటు వీఎల్టీ, ఇంటినెంబర్ల అసెస్మెంట్స్, మ్యుటేషన్స్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రాసెస్‌లో తేడాలను గుర్తించినట్టు వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద రికార్డులను స్వాధీనం చేసుకోవడంతోపాటు లోతుగా వివరాలు సేకరించగా, జగిత్యాల మున్సిపల్లో కలకలం మొదలైంది.
జగిత్యాల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల అర్బన్ : జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కోరెపు గంగారాం 1980లో జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌లో 4గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అందులో నుంచి రెండు గుంటలు ఆయన సోదరికి బహుమతిగా ఇచ్చాడు. అయితే నలభై ఆరేండ్ల క్రితం గంగారాంకు భూమిని విక్రయించిన వ్యక్తి రక్త సంబంధీకుడు తప్పుడు మార్గంలో ఆ భూమికి అసెస్మెంట్ రికార్డులను సృష్టించాడు. ఖాళీగా ఉన్న స్థలంలో షెడ్డు ఉన్నట్టు నమ్మించి, దానికి తప్పుడు ఇంటి నంబర్ వేసి, ఈ యేడాది జనవరి 9న మరొకరికి రిజిస్ట్రేషన్ చేశాడు. తర్వాత మరో పదిహేను ఇరవై రోజులకు ఇంటి నంబర్, అసెస్మెంట్ నంబర్ తప్పుగా ఉందంటూ రెక్టిఫికేషన్ పేరిట మరో రికార్డును సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సృష్టించాడు. ఈ విషయం తెలిసిన బాధితుడు గంగారం లబోదిబోమన్నాడు. తన భూమిని కబ్జా కాకుండా చూడాలని అధికారుల చుట్టూ తిరుగుతూ.. ఫిర్యాదులు చేస్తూ వచ్చాడు. గంగారాంకు జరిగిన అన్యాయాన్ని పూర్తి ఆధారాలతో ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 4న ‘జగిత్యాలలో భూమాయ!’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నాలుగైదేళ్లుగా జగిత్యాల మున్సిపాలిటీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీజిల్ కుంభకోణంతోపాటు మున్సిపల్ రెవెన్యూ, పట్టణ ప్రణాళిక శాఖ, శానిటేషన్ విభాగాల్లోనూ అవినీతి జరిగిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అవినీతి నిరోధక శాఖ దాడి చేసి, లంచం తీసుకుంటున్న ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఆ తర్వాత సైతం తనిఖీలు చేసింది. అలాగే విజిలెన్స్ శాఖ సైతం తనిఖీలు చేసింది. రెండేండ్ల క్రితం తప్పుడు పత్రాలతో వీఎల్‌టీని సృష్టించి, భూకబ్జాకు పాల్పడిన సంఘటనను ‘నమస్తే’ వెలికితీసింది. ఈ కథనం నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, ఆర్ఐపై కేసులు నమోదు కావడమే గాక, జైలుపాలయ్యారు. తాజాగా ‘నమస్తే’ ‘భూమాయ’ కథనంతో ఏసీబీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్‌కుమార్ నేతృత్వంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మున్సిపాలిటీకి చేరుకున్నారు. కార్యాలయం తలుపులు మూసివేసి రాత్రి వరకూ సోదాలు చేశారు. 14 శాఖల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టి, వివరాలు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ప్రతి ఉద్యోగి నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని ఒక ట్రేలో కుప్పపోశారు. స్థానిక పోలీసుల సహకారంతో కార్యాలయానికి ఉన్న దర్వాజలు, కిటికీల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి సోదాలు చేశారు.
ఏసీబీ అధికారులు దాదాపు రికార్డులనూ పరిశీలించారు. రెండేళ్ల నుంచి సంబంధిత డిపార్ట్మెంట్లో నిర్వహించబడిన ప్రతి ఫైల్ కరస్పాండెన్స్‌ను చెక్ చేశారు. అనుమానం కలిగిన ప్రతి ట్రాంజాక్షన్ వివరాలను నమోదు చేశారు. మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా నిర్మాణమైన గృహాల వివరాలు, అలాగే కేటాయించిన ఇంటి నంబర్లు, వాటి అసెస్మెంట్ నంబర్లు తదితర వివరాలను సేకరించారు. టౌన్ ప్లానింగ్‌తోపాటు శానిటేషన్ విభాగంలో అవకతవకలను గుర్తించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, అకౌంటెంట్ తదితర విభాగాల్లోనూ సోదాలు చేసి, అనుమానం వచ్చిన ప్రతి అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నారు. అలాగే నలభై ఆరేళ్ల క్రితం గంగారాం కొనుగోలు చేసిన భూమి మూడు నెలల క్రితం కబ్జాకు గురికావడం, ఖాళీ స్థలంలో షెడ్డు ఉన్నట్టు రికార్డులు, తప్పుడు అసెస్మెంట్, ఇంటి నంబర్లను సృష్టించి రిజిస్ట్రేషన్ చేయడాన్ని లోతుగా పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతోనే ఈ భూ ఆక్రమణ జరిగిందని అంచనాకు వచ్చినట్టు తెలిసింది. తనిఖీల సమయంలో అనుమానాస్పదమైన రికార్డులపై సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది నుంచి సరైన సమాధానాలు లభించలేదని, ఏసీబీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
తనకు న్యాయం చేయాలని ‘నమస్తే’ను ఆశ్రయించిన బాధితుడైన కోరెపు గంగారాం అందుబాటులో లేకపోవడంతో ఆయన కొడుకైన రాజ్‌కుమార్ నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. నలభై ఆరేండ్ల క్రితం కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు, గంగారాం సోదరికి ఇచ్చిన గిఫ్ట్‌డీడ్ పత్రాలు అన్నింటినీ తీసుకున్నారు. అలాగే తప్పుడు అసెస్మెంట్ నంబర్లు, ఇంటి నంబర్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తమకు న్యాయం చేయాలని ఏసీబీ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ‘నమస్తే’లో వచ్చిన ‘భూమాయ’ కథనం తీవ్ర ప్రభావం చూపిందని, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆఫీస్ నుంచే విచారణ చేయాలని, మున్సిపాలిటీలో సోదాలు చేయాలని ఆదేశాలు వచ్చాయని ఏసీబీ అధికారులు చెప్పారని వివరించాడు. అన్ని వివరాలను పరిశీలిస్తామని, అలాగే తప్పుడు అసెస్మెంట్ నంబర్లు, ఇంటి నంబర్ల వివరాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపాడు.
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. పది గంటలకుపైగా తనిఖీలు చేసి, దాదాపు ప్రతి రికార్డునూ లోతుగా పరిశీలించారు. అందులో అనేక అవకతవకలున్నట్టు గుర్తించారు. ఈ మేరకు రాత్రి 8.30గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశామని, అనేక అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్ యాభై శాతం మాత్రమే వసూలు జరిగిందని, ఎందుకు ఇలా జరిగిందని విచారిస్తున్నామన్నారు. అలాగే కమర్షియల్ ట్యాక్స్ వసూలు సైతం సరిగా లేవన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల ద్వారా మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి ఆదాయం రాలేదని తేలిందన్నారు. అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు ఆటోలు, ఒక ట్రాక్టర్ కనిపించకుండా పోయాయన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన షాపింగ్ క్లాంపెక్స్లకు పద్దెనిమిదేళ్ల క్రితం టెండర్లు నిర్వహించారని, మళ్లీ టెండర్లు నిర్వహించలేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. చెత్త కలెక్ట్ చేసే వాహనాలకు సంబంధించిన మరమ్మతుల బిల్లులు, డీజిల్ బిల్లులు, అలాగే రసాయనిక పదార్థాల కొనుగోళ్లలో తేడాలున్నాయన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రాసెస్ విషయంలోనూ తేడాలను గుర్తించామన్నారు. శానిటేషన్ వర్కర్లకు ఇచ్చే వస్తువుల నాణ్యత, వాటికి సంబంధించిన బిల్లులు, వ్యాట్ ట్యాక్స్ వివరాలు సరిగా లేవన్నారు. మున్సిపాలిటీలో ఉద్యోగులకు సంబంధించిన బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా సరిగా లేదన్నారు. ముఖ్యంగా వీఎల్టీ, ఇంటి నంబర్ల అసెస్మెంట్స్, మ్యుటేషన్స్ల్లోనూ తేడాలను గుర్తించామన్నారు. తనిఖీలు పూర్తి కాలేదని, రాత్రి పూట సైతం కొనసాగుతాయన్నారు. అన్ని రికార్డులను పరిశీలించిన తదుపరి ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేస్తామన్నారు.