పెద్దపల్లి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్ దేశాన్నే కుదిపేసిందని, అది తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్‌గా నిలిచిపోయిందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అభివర్ణించారు. ఏటా నవంబర్ 29న దీక్షా దివస్‌గా జరుపుకొంటున్నామని చెప్పారు. శనివారం ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లిలోని తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన అధ్యక్షతన పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ‘దీక్షా దివస్’ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ప్రాణత్యాగానికి తెగించిన రోజు ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజుగా నిలిచిపోయిందని అభివర్ణించారు. నాడు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్ర జలను ఏకం చేసి, రాష్ర్టాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్, ఉద్యమ నేత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన తెలంగాణను రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలోనే ఆదర్శంగా నిలిపారని ప్రశంసించారు. దేశంలోనే తెలంగాణ ఆర్థికంగా ముందువరుసలో నిలుస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. కాంగ్రెసోళ్ల మాటలకు మోసపోతే గోసపడుతామని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, ఇప్పు డు అదే నిజం అవుతున్నదన్నారు.
ప్రభు త్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని, ఈ సర్కారుపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. ఈ తరుణంలోనే ప్రజలను చైతన్యం చేసి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గంటా రాములు, బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉష, ఏగోళపు శంకర్‌గౌడ్, ఉప్పు రాజ్‌కుమార్, నారాయణదాస్ మారుతి, మాచీడి రాజుగౌడ్, బొడ్డు రవీందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, దేవరాజు, కుమ్మరి శ్రీనివాస్, ఇంజపురి నవీన్, కోల సంతోష్‌గౌడ్, మాదాసు సతీశ్, జక్కుల తిరుపతి, పర్లపల్లి రవి, రామరాజు, బండారి ప్రవీణ్, నగేశ్ పాల్గొన్నారు.