కరీంనగర్ కమాన్ చౌరస్తా, మార్చి 31 : ‘ఈద్-ఉల్-ఫితర్’ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నెలపాటు కొనసాగిన ఉపవాస దీక్షలను ఆదివారం సాయంత్రం ముగించారు. సోమవారం ఉదయమే కొత్త బట్టలు ధరించి, ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ‘ఈద్ ముబారక్’ అంటూ పరస్పర శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ముస్లింలకు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పెద్దపల్లి కమాన్, మార్చి 31 : కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం ఈద్గాల వద్ద ప్రార్థనల అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ బిల్లుతో స్వయం ప్రతిపత్తి కోల్పోతామని, ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నినదించారు. వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.