Murder | ముత్తారం, ఏప్రిల్ 11 : తల్లి చేతులో కొడుకు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33) భార్యతో విడాకులు కావడంతో తన తల్లిదండ్రులు రాజయ్య, లక్ష్మీ వద్దనే ఉంటున్నాడు.
విడాకులు కావడంతో నరేష్ మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే మృతుడు తల్లిదండ్రులను కొడుతూ, బూతులు తిడుతూ చిత్రహింసలు గురిచేసేవాడని తెలిపారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి 11:30 సమయంలో పడుకున్న తర్వాత నరేష్ అతిగా మద్యం సేవించి ఇంట్లోకి వచ్చి తన తల్లి లక్ష్మితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె అతడిని నెట్టివేసి అక్కడే దగ్గర్లో ఉన్న రోకలి బండతో నరేష్ తలపై, నుదుటిపై, ఛాతిపై కొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అతన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు నరేష్ చనిపోయాడని తెలిపారని మృతుని తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంథని సీఐ బి రాజు తెలిపారు.