కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్‌లోని పోచమ్మవాడలో నివాసం ఉంటున్న బాలసాని రాము (41) అనే కర్రీ పాయింట్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వన్ టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని లక్ష్మీనగర్‌కు చెందిన రాము స్థానికంగా కర్రీ పాయింట్ నిర్వహించుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి పోచమ్మవాడలో నివాసం ఉంటూ సస్పెన్షన్‌కు గురైన ప్రభుత్వ ఉద్యోగి సంతపురి సంతోష్ అనే వ్యక్తితో స్నేహం ఉంది. అయితే, రాము భార్య లతశ్రీ ఊరికి వెళ్లడంతో శనివారం రాత్రి సంతోష్‌కు ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు.
ఒక చోట కలుసుకుని ఇద్దరు పోచమ్మవాడలోని సంతోష్ ఇంటికి వెళ్లారు. అయితే, శనివారం ఊరికి వెళ్లిన రాము భార్య లతశ్రీ ఆదివారం నుంచి అతనికి ఫోన్ చేయగా ఎత్తడం లేదు. దీంతో లతశ్రీ ఇంటికి వచ్చి చూడగా రాము ఇంట్లో లేడు. అనుమానం వచ్చిన ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు లతశ్రీ ఇచ్చిన వివరాల ఆధారంగా రాముకు, సంతోష్‌కు మధ్య ఫోన్ కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు స్నేహితులని తెలియడంతో పోలీసులు పోచమ్మవాడలోని సంతోష్ ఇంటికి వెళ్లి చూశారు. ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు.
కానీ, లోపలి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన పోలీసులు తాళాలు పగుల గొట్టి చూడగా రాము శవమై కనిపించాడు. శనివారం రోజునే రాము బైక్‌పై సంతోష్ వెళ్లడం, అదే ప్రాంతంలోని ఓ వైన్స్ ఎదుట రాము బైక్ పార్కింగ్ చేసి ఉండడాన్ని స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో రాము స్నేహితుడైన సంతోష్‌పైనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాము శవం ఉన్న పరిస్థితిని బట్టి రెండు రోజుల కిందనే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. రాము భార్య తలశ్రీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ కోటేశ్వర్ తెలిపారు.. కాగా, మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.