korutla | కోరుట్ల, ఆగస్ట్ 3: పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్, చికెన్ సెంటర్లలో ఆదివారం మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ఈసందర్భంగా ఆయా తిను బండారాల షాపుల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిల్వ ఉన్న ఆహర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న యజమానులకు రూ. 13500 జరిమానా విధించారు. పట్టణంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
నిషేదిత ప్లాస్టిక్ కవర్లు వాడితే దుకాణాలు సీజ్ చేసి, ట్రెడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులకు హోటల్ యజమానులు నాణ్యతతో కూడిన ఆహరం అందించాలని సూచించారు. తడి, పొడి, హనికర చెత్తను మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారులకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలె అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, వార్డు ఆఫీసర్లు మధు, రాహుల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, రమేష్, హేమంత్, రాజేష్ పాల్గొన్నారు.