మన పల్లెలు మెరుస్తున్నాయి. రాష్ట్ర సర్కారు కృషి, చేపడుతున్న కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, మహిళా చైతన్యం లాంటి తొమ్మిది విభాగాల్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం దేశంలోనే రెండోస్థానంలో నిలిచి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని కైవసం చేసుకోగా, స్వయం సమృద్ధి వసతులు కలిగిన గ్రామాలుగా పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పంచాయతీలు మూడోస్థానంలో నిలిచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ అవార్డులు కైవసం చేసుకున్నాయి.
సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా పురస్కారాలు, జ్ఞాపిక, 50 లక్షల చొప్పున నగదు బహుమతులను తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, డీపీఓ వీరబుచ్చయ్య, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, సుల్తాన్పూర్ సర్పంచ్ అర్శనపల్లి వెంకటేశ్వర్ రావు, పంచాయతీ కార్యదర్శి వినోద్ కృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీపీవో చంద్రమౌళి, గంభీరావుపేట సర్పంచ్ కటకం శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి మాజీద్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డీపీవో రవీందర్ అందుకున్నారు.
– పెద్దపల్లి, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్రూరల్, ఏప్రిల్ 14