Godavarikhani | గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన అధికారిక కార్యక్రమాలు జరిగిన సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు సమాచారమివ్వడం లేదు. గతంలోనే చాలా సందర్భాల్లో ప్రొటోకాల్ విభేదాలు తలెత్తాయి. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయింది.
ఆదివారం గోదావరిఖని పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అధికార కాంగ్రెస్ పార్టీ ఐదుగురు మంత్రులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైన బహిరంగ సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కనిపించలేదు. ఈ విషయాన్ని మంత్రులు ఎవరూ ప్రస్తావించలేదు. ఆయన అందుబాటులో ఉన్నా సమాచారం లేకపోవడం వల్లే ఆయన రాలేదని ఎంపీ వర్గీయులు పేర్కొంటూ బహిరంగ సభను వారు కూడా బహిష్కరించారు. పెద్ద సంఖ్యలో అయిదుగురు మంత్రులు పాల్గొన్న సభలో కోల్డ్ బెల్ట్ తో విడదీయరాని సంబంధం ఉన్న మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని సభకు ఆహ్వానించకపోవడం పట్ల వివేక్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకవైపు అతడి కుమారుడు ఎంపీ వంశీని విస్మరిస్తూనే వివేకును పక్కన పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా అక్షేపిస్తున్నారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు స్వర్గీయ వెంకటస్వామి (కాకా) తనయుడు వివేక్ పట్ల అతడవి కుమారుడి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై దళిత సంఘాలు సైతం తీవ్రంగా మండిపడుతున్నాయి. వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గోదావరిఖని ప్రాంతానికి వచ్చిన క్రమంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ మున్సిపల్ నాయకుడు స్వయంగా ప్రకటించడం ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు ఎవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం విభేదాలను స్పష్టంగా తెలియజేసింది. ఆనాటి నుంచి నేటి వరకు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం నాడు గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభ కార్యక్రమం అనంతరం వివేక్ వర్గీయులు ఏం చేయాలనే అంశంపై ఒక సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఎంపీ…మంత్రి దళితులనే అవమానిస్తున్నారా? : కాంగ్రెస్ సీనియర్ నేత గుమ్మడి కుమారస్వామి
పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి దళితులు కాబట్టే వారిని అవమానిస్తున్నారా..? అని, రామగుండం నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న స్వర్గీయ కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి వచ్చిన వివేక్, వంశీకృష్ణను అవమానించడం సరైనది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత గుమ్మడి కుమారస్వామి మండిపడ్డారు. ఈ విషయంలో ఇప్పటికే స్థానికంగా ప్రొటోకాల్ నిబంధనలు విస్మరిస్తున్నారని, ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేశామని ఆయన పేర్కొన్నారు.
అయినా పట్టించుకోకపోవడం విచారకరమని, సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదివారం గోదావరిఖనికి వచ్చిన క్రమంలో ఎంపీ విషయమై ఆయనే ఆరా తీస్తే బాగుండేదని, రామగుండం లో జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు.