Road accident | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 03 : పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్, మాజీ సర్పంచ్ మామిడి పద్మ భర్త కొమురయ్య బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దపల్లికి పనుల నిమిత్తం వచ్చి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో మూలసాలకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొమురయ్యను కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టడంతో కొమురయ్య తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ క్రమంలోనే అటుగుండా కాన్వాయ్ గా వెళ్తున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రమాదం తెలుసుకుని వాహనాన్ని ఆపి పెద్దపల్లి దవాఖాన వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుడికి అవసరమైన చర్యలు, చికిత్సలు అందించాలని సంబంధిత శాఖ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. సంఘటనా స్థలానికి పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తన సిబ్బందితొ అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూ రక్షణ చర్యలు చేపట్టారు.
పలువురు నాయకులు ,గ్రామస్తులు పాల్గొని కొమురయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చివరికి కరీంనగర్ లో వైద్యచికిత్స అనంతరం హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి శ్రీకాంత్, తాడిశెట్టి అరుణ్, కుర్మ ప్రవీణ్, కుర్మ శివ, కొండా రేవంత్, సుతారి ప్రణయ్, రాజిరెడ్డి తరుణ్, బంటీ తదితరులు పాల్గొన్నారు.