కరీంనగర్ తెలంగాణ చౌక్ ఏప్రిల్ 8 : పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఐ పార్టీ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను నిరసిస్తూసీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో నగరంలోని కమాన్ చౌరస్తా వద్ద మంగళవారం ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి చేరుకున్నారు. వన్ టౌన్ ఏఎస్ఐ కన్నా రాం ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో నాయకులకు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నాయకులు కింద పడిపోయారు.
ఒకరిద్దరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలోనే కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు . కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుందని తెలిపారు. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు.
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ముడి సరుకుల ధరలు తక్కువ ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాయకులు కేదారి బోయిని అశోక్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, పార్టీ కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, కార్యాలయ ఇంచార్జ్ సదాశివ పాల్గొన్నారు.