కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 29: ఈబీసీ రిజర్వేషన్లతో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని బీసీలకు అన్యాయం చేశారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత రాజారామ్ యాదవ్ విమర్శించారు. కుల, మతాల పేరుతో రిజర్వేషన్లు కల్పిస్తున్న పాలకులు, సమాజంలో 50శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజంలో సింహభాగం ఉన్న వెనుకబడిన తరగతులను మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు మరో పోరాటానికి బీసీలంతా కలిసికట్టుగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కృషి భవన్లో బీసీ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. దేశ సంపద సృష్టిలో వృత్తి కులాల పాత్ర ఇతోధికమని తెలిసినా, ఆ కులాలను అణిచి వేస్తున్న ఘనత అగ్రకుల నేతల కనుసన్నల్లో పాలన సాగిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ నిరుద్యోగుల వెన్ను విరుస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి జీవో నం.29 తెచ్చి వారి భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో ముందడుగేస్తూ బీసీలంతా సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు తుల ఉమ మాట్లాడుతూ, బీసీలు ప్రశ్నించే స్థాయికి ఎదగడం హర్షించదగ్గ పరిణామమన్నారు. అన్ని పార్టీల వెన్నులో వణుకు మొదలైందని, అగ్రనేతలు బీసీల గురించి మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంట రాములు యాదవ్ మాట్లాడుతూ, బీసీ ఉద్యమంలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. బీసీ నాయకత్వం ఎదిగి వచ్చినా పార్టీలు టికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల విజయకుమార్, బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు మర్రి శ్రీనివాస్‌యాదవ్, సీనియర్ అడ్వకేట్ రాజన్న యాదవ్, పాంచాల సత్యనారాయణ, ప్రభాకర్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోట రాములుయావ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి అతాపటేల్, బీసీ సంఘం నాయకురాలు పావని, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఒగ్గు కళాకారుడు పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ నూటొక్కదీపాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.