తెలంగాణచౌక్, అక్టోబర్ 9: ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, సుప్రీం కోర్టు తీర్పును రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నాయకులు అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వచ్చి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడారు.
సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వర్గీకరణ అమలు చేయకుండా ఎస్సీ రిజర్వేషన్ల ఉద్యోగాలను భర్తీ చేయవద్దని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి లొంగి ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడంలో వెనుకడుగు వేస్తున్నట్టు భావించాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, రుద్రరాపు రాంచంద్రం, సాగర్, కొమురయ్య, రాజన్న, శంకర్ పాల్గొన్నారు.