కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది. నామినేషన్ల ఘట్టం సోమవారమే ముగియగా, ఈసారి అధిక సంఖ్యలో దాఖలు కావడం బరిలో నిలిచే అభ్యర్థులకు ఒక సవాల్‌గా మారింది. దాంతో నామినేషన్ వేసిన వారిలో కొంతమందిని విత్‌డ్రా చేయించి, తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. రేపటి వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశముండగా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఈ సారి భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య అలజడి రేపుతున్నది.
2019 ఎన్నికలతో పోలిస్తే 1.58 లక్షల పైచిలుకు గ్రాడ్యుయేట్ ఓటర్లు, 3,874 మంది ఉపాధ్యాయ ఓటర్లు పెరగడం కలవరపెడుతున్నది. మొత్తంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తుండగా.. అందులో బుజ్జగింపులు, సంప్రదింపుల తర్వాత చివరికి ఎంత మంది బరిలో ఉంటారన్నది రేపటి సాయంత్రం వరకు వెల్లడి కానున్నది. మరోవైపు నామినేషన్లకు ముందే ఎవరికి వారు ఓటర్ల మెప్పు పొందేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేయగా.. ఇప్పుడు నామినేషన్ల జాతర ముగియడంతో అందరి దృష్టి ప్రచారంపై నెలకొన్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణప్రతినిధి) : కరీంనగర్- మెదక్ -నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. ఈ సారి నామినేషన్ల సంఖ్య అనుహ్యంగా పెరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వంద మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, అంచనాలకు మించి దాఖలయ్యాయన్న చర్చ ప్రస్తుతం అభ్యర్థుల్లో నడుస్తున్నది. అలాగే టీచర్ ఎమ్మెల్సీకి 17 మంది 32 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం వచ్చిన నామినేషన్లు అందరినీ కలవర పెడుతున్నాయి.
ఈ సారి పోటీని కొంత మేరకు అంచనా వేసిన ఆయా పార్టీల ముఖ్య నాయకులు, అభ్యర్థులు.. నామినేషన్ చివరి రోజున తమ సత్తాను చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. భారీ ప్రదర్శనలు, ర్యాలీలు తీసి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం ఈ నెల 3 నుంచే మొదలైనా సోమవారమే మాత్రం అత్యధికంగా వేశారు. ఈ ఒక్క రోజే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 80 మంది అభ్యర్థులు 125 నామినేషన్ సెట్లను వేశారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది అభ్యర్థులు 22 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. నిజానికి 3 నుంచే నామినేషన్ల ఘట్టం మొదలు కాగా, ఈ నెల 9 వరకు వచ్చిన నామినేషన్ల సంఖ్య అంతంతే ఉన్నది. దీంతో పోటీ మాములుగానే ఉండొచ్చని భావించినా.. చివరి రోజు ఊహించని విధంగా నామినేషన్లు రావడం ప్రస్తుతం అందరికీ సవాల్‌గా మారింది.
రాజీకి ప్రయత్నాలు?
అంచనాలకు భిన్నంగా నామినేషన్లు దాఖలు కావడంతో కొంతమంది ప్రధాన అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న వారిని విత్‌డ్రా చేయించేందుకు బేరసారాలు మొదలు పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. పేర్లు పోలి ఉన్న అభ్యర్థుల వల్ల తమకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్న కొంతమంది పోటీదారులు.. ముందుగా వారితో రాజీకి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వివిధ వ్యక్తులు విద్యాసంస్థల నుంచి పోటీ చేస్తుండగా, అన్ని విద్యాసంస్థలు ఒక తాటిపైకి వస్తే బాగుటుందన్న ఉద్దేశంతో కొంతమందిని విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతున్నది. అలాగే గతంలో స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన కొంత మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలోనూ ఒక్కరే బరిలో ఉండి.. ఆ ఒక్కరికి మద్దతివ్వాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కొంత మంది.. అందరూ ఒకే చోట కూర్చోని ఎదో ఒక నిర్ణయం తీసుకుందామని భావిస్తున్నట్టు కొంతమంది చెబుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ నెల 13 మధ్యాహ్నం మూడు గంటల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశమున్న నేపథ్యంలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, వీలైనంత ఎక్కువ మందిని విత్డ్రాచేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, విత్ డ్రా అయిన వ్యక్తులను తమవైపు తిప్పుకునేందుకు బేరసారాలకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది అభ్యర్థులు ససేమిరా అంటుండగా.. మరికొంత మంది మాత్రం విత్‌డ్రా చేసుకునేందుకు లొంగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులంతా బరిలో ఉంటారా..? లేక ఎవరికైనా మద్దతు పలుకుతూ ఉపసంహరించుకుంటారా..? అన్నది 13న పూర్తి క్లారిటీ రానున్నది.
పెరిగిన ఓటర్లు
2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. అందులో గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య అనుహ్యంగా పెరిగింది. పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలకునే ఔత్సాహిక అభ్యర్థులు ఒకరికొకరు పోటీపడి ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆ కారణంగానే ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి 2019 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు 1,96,321 మంది ఉండగా, ఈ సారి తుదిజాబితా ప్రకారం 3,55,159కి చేరింది. అంటే 1,58,830 మంది ఓటర్లు పెరిగారు.
అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 2019 ఎన్నికల్లో 23,214 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 23,214కి చేరింది. అంటే కొత్తగా 3,874 మంది ఓటర్లు పెరిగారు. కాగా, ఈ సారి టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థుల గెలుపోటముల విషయంలో కరీంనగర్ జిల్లా కీలకం కానున్నది. అత్యధిక ఓటర్లు నమోదు కావడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో అధికారయంత్రాగం ఎన్నిలకు ఏర్పాట్లు చేస్తున్నది. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన చర్యలపై దృష్టిపెట్టింది.