పెద్దపల్లి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి/ కరీంనగర్ కార్పొరేషన్ : ‘కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలింది. ప్రజా పాలన పేరిట పగ, ప్రతీకారాలతో పాలనను సాగిస్తున్నది. ఈ మోసకారి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి గులాబీ జెండా ఎగరేయాలి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె, కోతిరాంపూర్‌లోని జ్యోతిభా ఫూలే విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత పెద్దపల్లికి వెళ్లి, అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ‘కాంగ్రెస్ తల్లి వద్దు.. తెలంగాణ తల్లి ముద్దు’ అని నినదించారు. అనంతరం రంగాపూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్‌హరి కూతురు వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. గడిచిన పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని దేశానికే రోల్ మోడల్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కానీ, కాంగ్రెస్ ఏడాది పాలన మొత్తం అబద్ధాలు, మోసాల మయమేనని విమర్శించారు. యావత్ తెలంగాణ నెత్తిన నీటి కుండలా పెద్దపల్లి జిల్లా ఉందని, అందుకే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాలను ఒడిసి పట్టే విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు.
బరాజ్‌లలో నీళ్లు నిండుగా ఉంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవని, చిన్న చిన్న మరమ్మతులతో బాగయ్యే మేడిగడ్డ బరాజ్‌ను కావాలనే కక్ష పూరితంగా పక్కన పెట్టారని మండిపడ్డారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 16టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అది హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, ఈ ప్రాంతంలోని పరిశ్రమల అవసరాలకే సరిపోతుందని, మరి సాగు నీటి పరిస్థితేంటో సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం లింక్ కెనాల్‌తో హుస్సేన్ మియావాగును అనుసంధానం చేశామని, అది వాడుకోకపోవడం వల్ల ఇప్పుడు హుస్సేన్‌మియా వాగు ఎండిపోయి సాగునీటికి రైతులు గోస పడుతున్నారన్నారు.
జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాత్రి కల్లా రైతు భరోసా డబ్బులు వేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి చెప్పి మోసం చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను అందించిన బీఆర్ఎస్ పెద్దపల్లిని జిల్లాగా మలుచుకొని ప్రగతికి పునాదులు వేసిందన్నారు. అలాంటి బీఆర్ఎస్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ మోసాలను గడపగడపకూ వివరించి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పెంట రాజేశ్, రాష్ట్ర నాయకులు కోలేటి దామోదర్, చిరుమిల్ల రాకేశ్, మూల విజయారెడ్డి, మిర్యాల రాజిరెడ్డి, రవీందర్ సింగ్, రఘువీర్ సింగ్, దాసరి ఉషా, పుట్ట శైలజ, ఉప్పు రాజ్‌కుమార్, మురళీధర్‌రావు, అభిషేక్‌రావు, మార్క్ లక్ష్మణ్, కొయ్యడ సతీష్, ఆకుల స్వామివివేక్ పటేల్, పడాల సతీశ్, భిక్షపతి, పస్తం హన్మంతు, పెంచాల శ్రీధర్, ముబీన్ పాల్గొన్నారు.
Kavitha
కాగితాలను కాదు..జీవితాలను మార్చాం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాగితాలను కాదు, జీవితాలను మార్చాం. సింగరేణిలో మారుపేర్ల విషయంలో మేం మానవతా ధృక్పథంతో పనిచేశాం. 13వేల మందికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాం. ఎవరూ ఆలోచించని విధంగా కేసీఆర్ 500 కోట్ల సింగరేణి నిధులతో మెడికల్ కళాశాలను నిర్మించి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. 13, 14శాతం ఉన్న బోనస్‌ను 32శాతానికి తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. అప్పుడు 32శాతం ప్రకటిస్తే అంతే మొత్తం జమైంది. కాంగ్రెస్ మాదిరి 33శాతం చెప్పి 15శాతం మాత్రం వేయలేదు. ఇప్పడు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు నలిగిపోతున్నాయి. 200 మంది డిపెండెంట్ కార్మికులు గోలేటి నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు.
– పెద్దపల్లిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీసీ హక్కుల కోసం పోరాడుతాం
బీసీలకు రాజకీయ సాధికారత వచ్చేంత వరకు, రాజకీయాల్లో న్యాయంగా వాటా దక్కేదాకా మా పోరాటం ఆగదు. ఈ ఉద్యమంలో జాగృతి ముందుంటుంది. బీసీ ఉద్యమాల్లో పని చేస్తున్న అందరు పెద్దలను కలుస్తాం. వారితో సమాలోచనలు చేస్తాం. బీసీ జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెకలు చెప్పింది. ఇటీవల ప్రకటించిన బీసీ కులగణన లెక్కలనైనా పరిగణనలోకి తీసుకోవాలి. మీ లెక్కల ప్రకారం చూసినా 46.3 శాతం బీసీలు, 10 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొని మొత్తంగా 56.3 శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలకు పోవాలి. క్రితం సారి చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య తక్కువగా ఉంది. కానీ, ఇప్పుడు పెరిగింది. ఒక్క ఓసీల జనాభా పెరిగి బీసీలు, ఎస్టీలు, ఎస్సీల జనాభా ఎలా తగ్గుతుంది? దీని వెనుక ఉన్న మతలబు ఏంటో చెప్పాలి.
– కరీంనగర్లో విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది
కాంగ్రెస్ అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ప్రతి రోజూ అంతకు రెండింతలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నది. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి పదమూడు నెలలు దాటినా ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కమీషన్లపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రతిష్టించిన తెలంగాణ తల్లిని కాదని, కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఏడాది పాలనలోనే 80 శాతం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సర్వేలే చెబుతున్నాయి.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
గుణపాఠం తప్పదు
ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులకు తమ సీట్లను కాపాడుకోవడం మీదున్న శ్రద్ధ్ద ప్రజలకు అందించే సేవపై లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నరు.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు (పెద్దపల్లి)
కార్మికనేత కౌశిక్‌హరి కూతురు, అల్లుడు నివేదిత-మణితేజరెడ్డిని ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత