జగిత్యాల, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : పోరాటాల ఖిల్లా జగిత్యాల నుంచే బీసీ ఉద్యమం కదం తొక్కుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గులాబీ జెండానే తమ ధైర్యమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక తేల్చారని గుర్తు చేశారు.
కానీ, అబద్ధపు మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బురిడీ కొట్టించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు బీసీ గణన విషయంలో పక్కా మోసానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు లెకలు చెబుతూ కావాలనే బీసీ జనాభాను తకువ చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ వర్గాల్లో ఏ కులంలో ఎంత జనాభా ఉన్నదో లెకలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
బీర్పూర్ మండలం మంగెళ గ్రామానికి చెందిన రైతు ఎండిన పొలాలను చూపుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కేసీఆర్‌పై అకసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారుకు రైతులకు నీళ్లిచ్చే తెలివి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షను పకన పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం లింక్-1 ద్వారా నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి ఎత్తిపోతలు నిలిపేయడంతో జీవనదిలా ఉన్న వరద కాలువ నీళ్లులేక ఎండిపోయిన దుస్థితికి వచ్చిందని ఆవేదన చెందారు. జగిత్యాల, పెద్దపలి జిల్లాల్లో సైతం పంటలకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని, రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Karimnagar3
కేసీఆర్‌తోనే జగిత్యాల అభివృద్ధి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే జగిత్యాల జిల్లా అభివృద్ధి జరిగిందని, జగిత్యాలను జిల్లా కేంద్రంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. బోర్నపెల్లి-బెల్లాల వంతెన ఎప్పుడూ ఎన్నికల హామీగానే ఉండేదని, దాన్ని కేసీఆర్ పూర్తి చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు పాత ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల మధ్య వారధి ఏర్పడడంతో పాటు అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించామని, ఆ ఇండ్లలో ఇంకా 900 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుందని ఎవరూ ఊహించలేదని, నేడు శరవేగంగా అతి పెద్ద మెడికల్ కాలేజీ, అనుబంధంగా దవాఖాన సిద్ధమవుతుందని తెలిపారు. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని యాదాద్రి క్షేత్రంలా మార్చాలని కలలుగన్నామని, దానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామని, దాదాపు 350 ఎకరాల భూమిని స్థిరీకరించుకున్నామని, ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఈ క్రమంలోనే ప్రభుత్వం మారిందన్నారు.
ప్రభుత్వం మారితే అభివృద్ధి ప్రణాళికలు ఆగిపోవద్దన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా నిధులు ఇవ్వాలన్నారు. ఈ ప్రాంత నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొండగట్టు అభివృద్ధికి కృషి చేయాలని, నిధులు తేవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల ప్రాంతం నేడు అభివృద్ధి పథంలో ఉందంటే కేసీఆర్ చలువతోనేనని స్పష్టం చేశారు.
శ్రేణులకు దిశానిర్దేశం
ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటామని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసానిచ్చారు. సోమవారం జగిత్యాలలో పర్యటించిన ఆమె, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, పట్టణాలకు చెందిన శ్రేణులతో సమావేశమయ్యారు. రాయికల్, బీర్పూర్, జగిత్యాల అర్బన్, రూరల్, సారంగాపూర్ మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు చెప్పిన విషయాలను నోట్ చేసుకోవడంతోపాటు మనోధైర్యం కల్పించారు.
భవిష్యత్‌పై మార్గదర్శనం చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతుందని, వచ్చేరోజులన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటాయని వారికి వివరించారు. ‘కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 3.0 వస్తుందని, అందరూ భరోసాగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎప్పుటికప్పుడు సమన్వయం చేస్తారని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు.
‘మీ చెల్లెగా, అకగా చెప్తున్నా.. ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తన పరిధిలో ఎకడ, ఎలాంటి అవకాశమున్నా ఉద్యమకారులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చానని, రానున్న రోజుల్లోనూ అలాగే ఇస్తానిన స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు, తులా రాజేందర్రావు, గట్టు సతీశ్, దావ సురేశ్, శీలం ప్రియాంక ప్రవీణ్, దేవేందర్ నాయక్, సమిండ్ల శ్రీనివాస్, సందీప్ రావు, మహిపాల్‌రెడ్డి, వొల్లెం మల్లేశం పాల్గొన్నారు.
సంజయ్ కుమార్ ద్రోహం చేశారు
డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2014లో టికెట్ ఇచ్చాం. 2018, 2023లోనూ టికెట్ ఇవ్వడంతో పాటు ఆయన గెలుపు కోసం కృషి చేశాం. పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంపై గెలిచిన ఆయన తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది పోయారు. పార్టీకి, కార్యకర్తలకు ద్రోహం చేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినా జగిత్యాల ప్రాంత కార్యకర్తలు, మనోధైర్యం, మొక్కవోని దీక్షతో ఉన్నారు. ఉప ఎన్నిక ఏ సమయంలో వచ్చినా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత