జగిత్యాల కాంగ్రెస్‌లో చిచ్చురగులుతున్నది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అగ్గిరాజుకుంటున్నది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వర్గాల మధ్య కొన్ని నెలలుగా నడుస్తున్న అంతర్యుద్ధం, తాజాగా జరిగిన హత్యతో బహిర్గతమవుతున్నది. తాజాగా ఎమ్మెల్సీ అనుచరుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మారు గంగారెడ్డి మర్డర్ కావడం సంచలనం సృష్టించింది. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుకు గంగారెడ్డిని ప్రతిపాదించడం వల్లే దారుణం జరిగిందని, ఈ హత్యకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కారణమని ఆరోపిస్తూ జీవన్‌రెడ్డి వర్గీయులు ఆందోళన చేయడం, ధర్నాలో ఎమ్మెల్సీ స్వయంగా నాలుగు గంటలకు పైగా పాల్గొనడం పార్టీని కుదిపేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ కావాల్సిన గంగారెడ్డిని హత్య చేయడం అంటే తనను హత్య చేయడమేనని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం కాకపుట్టిస్తుండగా, ఈ హత్య ఇరువర్గాల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది.
జగిత్యాల, అక్టోబర్ 22, (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని మార్కెట్ కమిటీల పాలకవర్గాల ఏర్పాటు పూర్తయింది. కానీ, ఇంత వరకు జగిత్యాల నియోజకర్గంలోని రెండు మార్కెట్ కమిటీల పాలకవర్గాలను నియమించలేదు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో జగిత్యాల, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతోపాటు పాలకవర్గానికి కొందరు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. జగిత్యాల మార్కెట్ కమిటీకి జాబితాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బీసీ నేత మారు గంగారెడ్డి పేరును ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పాలకవర్గాల భర్తీ నిలిచిపోయింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరగా, నియోజకవర్గంలోని రాజకీయాలన్నీ తారుమారయ్యాయి. ఎమ్మెల్సీ ప్రతిపాదించిన పేర్లను పక్కన పడేస్తూ, ఎమ్మెల్యే మరికొందరి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో చిక్కుల్లో పడిన అధికారులు ఎవరినీ ఎంపిక చేయకుండా వదిలిపెట్టారు. దీంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ ప్రతిపాదించిన మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురి కావడం, హత్య చేసిన వ్యక్తుల వెనుక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం ఉందని జీవన్‌రెడ్డి వర్గీయులు బాహాటంగానే ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది.
తన అనుచరుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావాల్సిన గంగారెడ్డిని హత్య చేయడం అంటే తనను హత్య చేయడమేనని, జగిత్యాలలో కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ వాళ్లనే చంపుతున్నారని, తనకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ అయిన అనుచరుడిని చంపివేశారని జీవన్‌రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేయడంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. అధికారం లేకున్నా, దశాబ్దకాలంపాటు పార్టీ కోసం పనిచేశామని, పోలీస్ కేసుల్లో చిక్కుకొని, జైలుకు వెళ్లి వచ్చామని గుర్తు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం గుర్తింపు వస్తుందనకుంటే నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లు ఏ నాయకుడితో తాము పోరాటం చేశామో..? ఇప్పుడు అదే నాయకుడు పార్టీలోకి చేరి, తమకు పదవులు రాకుండా చేస్తున్నాడని తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
గ్రంథాలయ చైర్మన్ ఎంపికలోనూ జాప్యం
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పాలకవర్గం ఎంపిక విషయంలోనూ తీవ్ర జాప్యం నెలకొంది. జిల్లాస్థాయి పోస్టు కావడంతో మూడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవిని ఆశిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ఒక సీనియర్ నాయకుడికి చైర్మన్ పోస్టు కట్టబెట్టాలని ప్రభుత్వ విప్ ప్రయత్నించారు. అలాగే, కోరుట్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు సైతం అదే పదవిని ఆశిస్తూ వచ్చారు. జిల్లా కేంద్రానికి చెందిన దళిత సీనియర్ కార్యకర్త పేరును ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిపాదించారు. అయితే, ఇది ఇష్టం లేని ఎమ్మెల్యే పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న మరో నాయకుడి పేరును సిఫారసు చేశారు. దీంతో చైర్మన్ ఎంపికలో ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ పదవి భర్తీ విషయంలో ఎమ్మెల్యే చక్రం తిప్పి, తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నిర్ణయాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్టు తెలుస్తున్నది. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జితో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకొని, చొప్పదండి, ధర్మపురి ఎమ్మెల్యేలను ఒప్పించి, ఎమ్మెల్సీ ప్రతిపాదించిన దళిత వర్గానికి చెందిన నాయకుడికి కాకుండా, తన సామాజిక వర్గానికి చెందిన కోరుట్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడి పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రభుత్వం పది పన్నెండు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను, పాలకవర్గాలను ప్రకటించినా, జగిత్యాలకు ప్రకటన జరగనట్టు తెలుస్తున్నది. కాగా, జగిత్యాల ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ విప్, ఇతర ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఒకే పేరును ప్రతిపాదించడంతో పార్టీ అధిష్టానం సైతం అతడి నియామకానికే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.
హత్యతో ఉప్పు నిప్పుగా.. ఇరువర్గాలు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య నిన్నామొన్నటి వరకు విభేదాలు ఉండగా, తాజాగా జీవన్‌రెడ్డి అనుచరుడి హత్యతో పరిస్థితి ఉప్పు, నిప్పుగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన ఒకరు ఒకవైపు ఉంటే, మరొకరు మరోవైపు ఉంటూ వచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మైనింగ్‌శాఖకు ఒక లేఖ రాశారు. మల్యాల మండల పరిధిలో అనేక అక్రమ క్రషర్లు పనిచేస్తున్నాయని, వాటి వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతున్నదని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ క్రషర్లన్నీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్గానికి చెందినవనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖరాయడం సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల జగిత్యాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్యకర్తలు దసరా శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వీటిని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఎమ్మెల్సీ వర్గీయులే చింపివేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపించగా, పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇవన్నీ సద్దుమణగక ముందే చోటుచేసుకున్న హత్య జగిత్యాల కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించింది. జగిత్యాల కాంగ్రెస్‌లో జరుగుతున్న సంఘటనలతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర మానసిక క్షోభకు లోనవుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఎటు వెళ్తే ఏమవుతుందో..? అని భయపడుతున్నారు. కాగా, ఇలాంటి పరిస్థితులు పార్టీకి మంచివి కావని, పార్టీ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకొని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి భరోసా కలిగించాలని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇంక కాంగ్రెస్‌లో ఉండలేను
జగిత్యాల, అక్టోబర్ 22, (నమస్తే తెలంగాణ) : ‘నా వాళ్లను చంపుతున్నారు. నన్ను, కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగలేను. మా బతుకులు మమ్మల్ని బతుకనివ్వండి. పార్టీకి నలభై ఏండ్లుగా సేవ చేస్తున్నాను. అందుకు మంచి బహుమతి ఇచ్చారు. మీకో దండం.. మీ పార్టీకో దండం’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చచ్చిపోతున్నారని, పార్టీనే చంపుతున్నదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం వల్లే గంగారెడ్డి లాంటి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉన్నదా? అని ప్రశ్నించారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి మంగళవారం ఉదయం హత్యకు గురికాగా, విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చలించిపోయారు.
జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖానకు చేరుకున్నారు. తన ప్రధాన ఆనుచరుడి మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని భావించి పార్టీ శ్రేణులతో కలిసి పాతబస్టాండ్ వద్ద 563 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. గంగారెడ్డి తనకు తమ్ముడి లాంటి వాడని, 30 ఏండ్లుగా తన వెంట ఉన్న వ్యక్తి ఇలా దారుణంగా హత్య గురి కావడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గంగారెడ్డిని చంపుతానని బత్తిని సంతోష్ అనే వ్యక్తి గతంలో బెదిరించాడని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే హత్య జరిగిందని, బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు.
జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సముదాయిస్తూ, చర్యలు తీసుకుంటామని చెప్పగా, మీ ఎస్ఐ కాల్ రికార్డులు తీయాలని, అప్పడే హంతకుడికి, ఎస్ఐకి సంబంధం ఉందా? లేదా? తెలుస్తుదన్నారు. కాగా, విప్ లక్ష్మణ్‌కుమార్ పన్నెండు గంటల ప్రాంతంలో ధర్నా వద్దకు చేరుకోగా, నాయకులు ఘొరావ్ చేశారు. కార్యకర్త హత్యకు గురయ్యాడని ఉదయం 7 గంటలకు సమాచారం ఇస్తే.. ఇప్పుడా వచ్చేది? అంటూ ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎస్పీ అశోక్‌కుమార్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విప్ లక్ష్మణ్‌కుమార్ కలుగజేసుకునేందుకు యత్నించగా, ‘బాబు.. నీకో దండం.. నీ పార్టీకో దండం.. మమల్ని ఇలా బతుకనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ ధర్నాను విరమించి దవాఖానకు వెళ్లారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు, పార్టీ విధానాలపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు అధికారాన్ని ఆశించడం సహజమేనని, అయితే అధికారం కంటే నైతిక విలువలే ముఖ్యమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడంతో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు నైరాశ్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మూడు నెలలుగా మానసికంగా తీవ్రంగా కుంగిపోయాన్నారు. నలభై ఏండ్లు పార్టీలో పనిచేసిన తనలాంటి వారికి పార్టీలో స్థానం ఎక్కడ ఉంది? అన్నది అర్థం కావడం లేదన్నారు. గంగారెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్సీకి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సమయంలో జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో మాట్లాడడం కనిపించింది. ‘నా వాళ్లను చంపుతున్నారు. నన్ను, కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను’ అంటూ స్పష్టం చేశారు. కాగా, పీసీసీ అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడుతుండగానే, ఎమ్మెల్సీ ఆవేశంతో ఫోన్ కట్ చేసి, విసిరిపారేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.