కరీంనగర్- మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్రోల్మెంట్లో ఇటు పట్టభధ్రులు, అటు పంతుళ్లు సత్తా చాటారు. అంచనాలకు మించి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. ఈ నెల 4 మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగానే ఉన్న నమోదు ప్రక్రియ, రెండురోజుల్లో అనూహ్యంగా పెరిగింది. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ 3,58,452కి, టీచర్ ఎన్రోల్మెంట్ 27,879కి చేరింది. అయితే ఈ సంఖ్య మరింత పెరగడానికి అవకాశం ఉన్నది. గడువు ముగిసినా ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉందని ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇదే సమయంలో దరఖాస్తు దారుల్లో అర్హులను గుర్తించే పనిలో తలమునకలైంది.
కరీంనగర్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గస్థానంతోపాటు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల పదవీ కాలం వచ్చే మార్చి 29వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. అందులో భాగంగా ఓటరు నమోదుకు అవకాశమిస్తూ సెప్టెంబర్ 30న పబ్లిక్ నోటీస్ను జారీ చేసింది. అలాగే రెండు దఫాలుగా అక్టోబర్ 16, 25వ తేదీల్లో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఆ మేరకు నవంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఈసారి తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. గడువులోగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి ఈనెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 23వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. వచ్చే నెల 30న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుదిఓటరు జాబితాను వెల్లడిస్తామని చెప్పింది.
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్రోల్మెంట్ ఈ సారి అంచనాలకు మించి జరిగినట్టు తెలుస్తున్నది. ఔత్సాహిక అభ్యర్థులు పోటాపోటీగా నమోదు చేసుకోవడం, ఆ మేరకు అధికారులు కసరత్తు చేయడం వల్లే భారీగా ఎన్రోల్మెంట్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం పేర్కొన్న ప్రకారం ఎన్రోల్మెంట్ ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఆ ప్రకారం చూస్తే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 3,58,452 మంది పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 27,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి ఈనెల 4 మధ్యాహ్నం వరకు కూడా ఎన్రోల్మెంట్ ఆశించిన రీతిలో జరగలేదు. అప్పటివరకు పట్టభద్రుల స్థానానికి సంబంధించి 2,32,576 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కానీ, రెండు రోజుల్లో ఆ సంఖ్య ప్రస్తుతం 3,58,452కి చేరింది. అంటే 48 గంటల్లో 1,25,876 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్న పరిస్థితిని చూస్తే మరో 50వేల దరఖాస్తులు రావొచ్చని ఆశించారు. లేదా మూడు లక్షల ఎన్రోల్మెంట్ దాటక పోవచ్చని అంచనా వేశారు. కానీ, చివరి వరకు చూస్తే అధికారుల అంచనాలకు మించిపోయింది. 2019 ఎన్నికల్లో 1,96,321 మంది ఎన్రోల్మెంట్ చేసుకోగా, అప్పటితో పోలిస్తే ఈసారి 1,62,131 ఎన్రోల్మెంట్ పెరిగింది. అయితే తుది జాబితా ప్రకటించే వచ్చే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
ఇదే పరిస్థితి ఉపాధ్యాయుల్లోనూ కనిపించింది. ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం వరకు చూస్తే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 16,150 ఎన్రోల్మెంట్ మాత్రమే జరిగింది. కానీ, 6వ తేదీ అర్ధరాత్రి వరకు ఆ సంఖ్య 27,879కి చేరింది. అంటే రెండు రోజుల్లో కొత్తగా 11,729 మంది ఓటు నమోదు చేసుకున్నారు. 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను చూస్తే అప్పుడు 23,214 మంది టీచర్లు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అప్పటితో పోలిస్తే ఈ సారి 4,665 మంది పంతుళ్లు అదనంగా నమోదయ్యారు.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి ఈ నెల 6వ తేదీలోగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. 23 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వచ్చే నెల 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. అయితే ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించే సమయంలోనూ అర్హులైన ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకో వచ్చని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రక్రియ నామినేషన్ చివరి తేదీ వరకు కూడా కొనసాగుతుందని వేర్వేరు ప్రకటనల్లో స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్లు ఫారం-18లో, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఫారం-19లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓటర్ల నమోదు ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 17 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిని పరిశీలిస్తే.. ప్రస్తుతం 15 కొత్త జిల్లాలున్నాయి. 271 మండలాలు, 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నది. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ సారి ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంలో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా వైద్యులు, అధ్యాపకులు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా 25 మందికిపైగా పోటీలో నిలిచే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ ఈ స్థానంపై ఫోకస్ పెడుతున్నాయి. లక్షలాది మంది పట్టభద్రులను ప్రసన్నం చేసుకొని ఈ ఎన్నికల్లో గెలువాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కూడా ఈసారి పోటీ బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంఘాలు మద్దతు ఇవ్వకపోయినా.. స్వతంత్రులుగా బరిలో దిగేందుకు ఇప్పటికే చాలా మంది ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్టు భావిస్తున్న ఔత్సాహిక పోటీదారులు.. ఇక నుంచి తమ దృష్టిని ప్రచారం వైపు మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఎక్కువ ఓట్లు ఉన్నాయో.. ఆయా సంస్థలు, ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకొని వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారివారి ప్రయత్నాల్లో మునిగి పోయారు.