మల్యాల, ఫిబ్రవరి 14 : సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి విషయంలో చరిత్రలో నిలిచిపోనున్నారని, కొండగట్టు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. కొండగట్టు అంజన్నను మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారని, ఏనాడు కూడా కొండగట్టు ఆలయ అభివృధ్ధి విషయంలో కృషి చేయలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా గత డిసెంబర్ 7నఆలయ అభివృధ్ధికి రూ.100 కోట్లు ప్రకటించడంతో పాటూ ఈ నెల 7న పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసి, క్షేత్రస్థాయిలో మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే కొండగట్టుకు ఆనంద్‌సాయి పలుమార్లు వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక కార్యాచరణను ప్రాథమికంగా సిద్ధం చేశారని తెలిపారు. ఈ పరిస్థితుల్లోనే సీఎం కేసీఆర్ బుధవారం క్షేత్ర పర్యటనకు వస్తున్నారని, ఇదొక శుభసూచకంగా భావిస్తున్నామన్నారు.
భక్తులతోనూ మాట్లాడే అవకాశం
క్షేత్ర పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్ జేఎన్టీయూకు చేరుకుంటారు. ఆలయ అభివృద్ధిపై ఆర్కిటెక్చర్ ఆనందసాయితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. క్షేత్రంలో చేపట్టాల్సిన పనులపై అందులో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, అంజన్న భక్తులతో మాట్లాడాలని, క్షేత్రానికి కావాల్సిన అవసరాలు, భక్తులు కోరుకుంటున్న అంశాలను స్పష్టంగా క్షేత్ర స్థాయి నుంచి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఆలయ ఈవోతోపాటు మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్‌రావుతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ఏడాదికి నాలుగైదు సార్లు అంజన్నను దర్శించుకునే భక్తులను గుర్తించి, అలాంటి వారిని సమావేశానికి తీసుకురావాలని సూచించారు. అలాగే, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు సైతం ఈ పని చెప్పినట్లు సమాచారం.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఆలయ పరిసరాలతోపాటు నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. డీఐజీ రమేశ్‌నాయుడు, కలెక్టర్ యాస్మిన్ బాషా, జగిత్యాల ఎస్పీ భాస్కర్, కరీంనగర్, పెద్దపల్లి అడిషినల్ డీసీపీలు చంద్రమోహన్, భాస్కర్, రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు.
కొండగట్టుపై కలెక్టర్ యాస్మిన్‌బాషా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను మంత్రులు కలిసి ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలిసి ఆలయ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జడ్పీటీసీ రామ్మోహన్రావు, సర్పంచులు బద్దం తిరుపతిరెడ్డి, మిట్లపల్లి సుదర్శన్, సహకార సంఘం అధ్యక్షుడు రాంలింగారెడ్డి ఉన్నారు. అలాగే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ నుంచి కొండగట్టు వరకు వాహనాలతో పలుసార్లు ట్రయల్న్ చేశారు. కళాశాల ఆవరణలో నాలుగు చోట్ల వీఐపీ పార్కింగ్, పార్కింగ్ ఏర్పాటు చేశారు.