జగిత్యాల, అక్టోబర్ 24 : బీఆర్ఎస్ను విడిచి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదా..? అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి వెళ్లినప్పుడే ఆ పార్టీ వ్యక్తి అయ్యారని విమర్శించారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోక పోతే గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెట్టిన సమావేశానికి ఎమ్మెల్యే ఎందుకు హాజరయ్యారో ప్రజలకు తెలుపాలన్నారు. రాజకీయ జన్మనిచ్చింది బీఆర్ఎస్, కవిత అని గతంలో చెప్పిన ఆయన, ఇప్పుడు కాంగ్రెస్ నేపథ్యం కలిగిన కుటుంబం అని సోయి లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో పదవి పోతుందన్న భయంతో ఈ ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జాబితాపూర్‌లో జరిగిన మారు గంగారెడ్డి హత్యను బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, కౌన్సిలర్ దేవేందర్‌నాయక్, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్, అర్బన్ మండలాధ్యక్షుడు తుమ్మ గంగాధర్, మాజీ జడ్పీటీసీ మహేశ్, అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు, రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగెల గంగారెడ్డి, ఆనంద్ రావు, ఆసీఫ్, శ్రీనివాస్, గంగారాజం, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ముత్తు, నాయకులు పాల్గొన్నారు.