ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను త్వరగా పరిష్కరించడం కోసం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరికి-మన ఎమ్మెల్యే’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని బుధవారం వేకువజామున అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
-మల్లాపూర్, డిసెంబర్ 13
మల్లాపూర్, డిసెంబర్ 13 : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరికొత్తగా ‘మన ఊరికి-మన ఎమ్మెల్యే’ కార్యక్రమం చేపట్టారు. బుధవారం వేకువజామున అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీ, గాంధీనగర్‌లోని ఇంటింటా తిరుగుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి కృషి చేస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఏజెండా అని, నిత్యం ఉదయం వేళలో గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
కాలనీల్లో తాగునీటి సమస్య, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్వయంగా ఎమ్మెల్యేనే తమ ఇంటికి వచ్చిన సమస్యలు అడిగి తెలుసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ ఆకుతోట రాజేశ్, డీఈ ఆనంద్, ఎంపీడీవో రాజశ్రీనివాస్, ఎంపీడీవో జగదీశ్, ఏఈలు నిరంజన్, రాకేశ్, నిఖిల్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.