హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 15 : రెండో విడుత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన అసెంబ్లీ జీరో అవర్‌లో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలను పరిషరించాలన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎన్నుకొని దళిత బంధు అమలు చేశారని, అందులో 18 వేల పైచిలుకు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, రెండో విడుత సుమారు 2800 కుటుంబాలకు రావాల్సి ఉందన్నారు. వారి అకౌంట్లలో కూడా డబ్బు జమై ఉందని, బ్యాంకు అధికారులు అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, దానిని ఎత్తివేసి వెంటనే దళితులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
దళితబంధు రెండో విడుత రాదేమోనని నియోజకవర్గంలోని ఇద్దరు దళితులు ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శనిగరం, గోపాల్పూర్, మాదన్నపేట చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందడం లేదని, వెంటనే చివరి ఆయకట్టు వరకు నీరందించేలా అధికారులను ఆదేశించాలన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షా అరవై వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, గత రెండు నెలలుగా ప్రభుత్వం వారి అకౌంట్లలో జీతాలు కూడా వేస్తున్నదని, తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది అనడానికి సాక్ష్యం కూడా అదేనన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు కూడా కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల్లో భాగమేనన్నారు.