కమాన్‌చౌరస్తా/ జమ్మికుంట/ హుజూరాబాద్ రూరల్/ మానకొండూర్/ శంకరపట్నం/ కరీంనగర్ రూరల్/ సైదాపూర్/ వీణవంక, జూన్ 17 : త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. నగరంతో పాటు గ్రామాలు, మండల కేంద్రాల్లోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రేకుర్తి సాలెహ్నగర్, కళాభారతి వద్ద, బైపాస్ రోడ్, చింతకుంటలో గల ఈద్గాల్లో ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. సాలెహ్ నగర్ సదర్ ఖాజీ మన్ ఖబత్ షా ఖాన్ నమాజ్ చేయించగా, మత పెద్ద ఈద్గా ఖతీబ్ ముఫ్తి మహ్మద్ ఘియాస్ మెహియుద్దీన్ సందేశం ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, హాఫీజ్ సయ్యద్ మెయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్, ఎంఐఎం కార్పొరేటర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్ మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ సునీల్‌రావును పలువురు ముస్లింలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆయన వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మానకొండూర్, శంకరపట్నం, కరీంనగర్‌రూరల్, సైదాపూర్, వీణవంక, హుజూరాబాద్ మండలాల్లోని ఈద్గాల వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం ఒకరికొకరు అలాయ్‌బలాయ్ తీసుకుంటు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ఈద్గా వద్ద బక్రీద్ వేడుకల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, గుల్జార్ మసీద్ అధ్యక్షుడు మీర్ అహ్మద్ హుస్సేన్, పలువురు వార్డు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు. మానకొండూర్‌లోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మతపెద్దలు, ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.