హుజూరాబాద్ రూరల్, నవంబర్ 11 : “కాంగ్రెస్‌కు ఓటేస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటే ఇస్తరట.. అది కూడా రాత్రి ఇస్తరట.. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు ఖాయం.. కేసీఅర్ ప్రభుత్వం వస్తే 24 గంటల ఉచిత కరెంటు వస్తుంది. రాత్రి వచ్చే మూడు గంటల కరెంటు కావాలా?.. నిరంతరం ఉచిత విద్యుత్ కావాలా?” అని మండలి విప్, హుజూరాబాద్ బీఅర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాలతో పాటు పట్టణంలోని 1, 12, 13, 15 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో కరెంటు కోసం రైతులు రాత్రిపూట పొలాల వద్దనే ఉండే వారని, కేసీఅర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కష్టాలన్నీ తీరాయని, వ్యవసాయం అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎరువులు, విత్తనాల కొతతతో ఎంత ఇబ్బంది పడ్డారో మీరే ఆలోచించాలని కోరారు. ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటి వరకు ఏ గ్రామాన్నీ సందర్శించలేదని, ఎన్నికలు రాగానే నామినేషన్ వేసి తిరిగి వెనక్కి చూడకుండా హెలీక్యాప్టర్ ఎక్కి వెళ్లిపోయాడని గుర్తు చేశారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు డిపాజిట్ రాదని చెప్పారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా వినొద్దని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను ఆశీర్వాదించాలని కోరారు. అయన వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్, వైస్ చైర్పర్సన్లు గందె రాధిక, కొలిపాక నిర్మల, సర్పంచ్‌లు సువర్ణాల సునయాణం, తిరుమల, ఎంపీటీసీలు రాధమ్మ, శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొండాల్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.