పండుగపూట ఉమ్మడి జిల్లాపై నిర్బంధం అమలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల పేరిట అరెస్ట్లపర్వం కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ఠాణాల్లో బంధించడం, కొందరిని గృహనిర్భంధం చేయడం అణిచివేతకు అద్దంపట్టింది. పార్టీ ఫిరాయించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను నిలదీసిన కేసులో కౌశిక్‌రెడ్డిని రాత్రంతా త్రీటౌన్లోనే బంధించి ఉంచగా, ఆయన్ను కలువనీయకుండా అరెస్టులు చేయడంతో చాలా మంది పండుగపూట పోలీస్ స్టేషన్లలోనే గడపాల్సి వచ్చింది. అనేక హైడ్రామాల మధ్య సంక్రాంతి పండుగ రోజైన మంగళవారం కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు కాగా, రెండు రోజుల ఉత్కంఠకు తెరపడినట్టయింది.
కరీంనగర్, జనవరి 15(నమస్తే తెలంగాణ)/రాంనగర్: కరీంనగర్ కలెక్టరేట్లో ఈ నెల 12న నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరావు. ఇంతకీ నీది ఏ పార్టీ?’ అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకి లాక్కెళ్లారు. అదే రోజు జగిత్యాల ఎమ్మెల్యే పీఏ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తోపాటు కరీంనగర్ ఆర్డీవో వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఫిర్యాదుపై కాకుండా మిగతా రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, సోమవారం సా యంత్రం హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకొచ్చారు. అంతకుముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్భంధ కాండను కొనసాగించారు.
ముందు జాగ్రత్త చర్యల పేరిట బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో బంధించారు. ఇక కౌశిక్‌రెడ్డి సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావును మానకొండూర్‌లోని తన ఇంట్లో గృహ నిర్భంధం చేశారు. జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇదే విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అయితే పండుగ పూట నిర్బంధించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సోమవారం రాత్రి కొందరు బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ వన్‌టౌన్ ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, స్థానిక పో లీస్ శిక్షణ కేంద్రానికి తరలించి అక్కడే నిర్బంధించారు. అరెస్ట్ విషయం తెలిసి కరీంనగర్ వచ్చిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కూడా కలువనీయకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారు. సంఘీభావంగా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులను కట్టడి చేశారు.
కౌశిక్‌ను మొదట పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చిన పోలీసులు, అక్కడి నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి కూడా వచ్చి రాత్రంతా నిరీక్షించారు. పోలీసులు ఏ క్షణంలోనైనా మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చవచ్చనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే మంగళవారం హాజరు పరుస్తామని పోలీసులు చెప్పినా.. కొందరు అక్కడే నిరీక్షించారు.
కౌశిక్‌రెడ్డిని మంగళవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య త్రీ టౌన్ నుంచి కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ షీట్ సమర్పించిన ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డిపై ఇది వరకే కేసులు ఉన్నాయని, ఆయనను రిమాండ్‌కు పంపించాలని కోరారు. అయితే, కౌశిక్ రెడ్డి తరఫున ప్రముఖ న్యాయవాదులు మధుసూదన్‌రావు, సర్దార్ రవీందర్‌సింగ్ తమ వాదనలు వినిపించారు.
అన్ని కేసులు బెయిలేబులే అయినప్పుడు రిమాండ్‌కు పంపరాదని మెజిస్ట్రేట్‌కు విజ్ఞప్తి చేశారు. మెజిస్ట్రేట్ ఇరువర్గాల వాదనలు విని బెయిల్ మంజూరు చేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకు తాను రాజకీయాలు మాట్లాడడం లేదని, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది.