మల్లాపూర్, జూన్ 20 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం, మొగిలిపేటలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు నిధులు 5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ గ్రామాల్లో పుట్టి పెరిగారని, అందుకే గ్రామాల్లోని ప్రజల కష్టాసుఖాలన్నీ ఆయనకు స్పష్టంగా తెలుసన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ప్రతి పల్లెకూ ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ప్రతి హామీ ప్రజలకు అందేదాకా తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇక్కడ తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శశికుమార్, పీఆర్ డీఈ రమణారెడ్డి, ఎంపీవో జగదీశ్, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వనతడపుల నాగరాజ్, పీఎసీఎస్ చైర్మన్ బద్ధం అంజిరెడ్డి, నాయకులు దేవ మల్లయ్య, గౌరు నాగేశ్, కదుర్క గంగనర్సయ్య, ఓస రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.