నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 3 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం దసరా వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. పల్లెపల్లెనా సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వాహన పూజలు, పోలీస్ స్టేషన్లలో ఆయుధ పూజలు నిర్వహించారు. సాయంత్రం రాంలీలా కార్యక్రమాలు అట్టహాసంగా జరిపారు. పలువురు ప్రముఖులు శమీ పూజల్లో పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ శివారులోని యజ్ఞవరాహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గిద్దె పెరుమాళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీణవంకలోని జమ్మిచెట్టు వద్ద, హుజూరాబాద్ పట్టణంలో చౌదరి గద్దె వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు.