విద్యానగర్, ఫిబ్రవరి 3 : అన్ని వృత్తుల్లోకెల్లా వైద్య వృత్తి పవిత్రమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో జరుగుతున్న 9వ రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సులో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కరీంనగర్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. తీగల బ్రిడ్జితోపాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, రోడ్లు, అభివృద్ధి చెందాయన్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
మోకాలు కీలు, వెన్ను శస్త్ర చికిత్సలు చేయించాలంటే గతంలో హైదరాబాద్‌కే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం కరీంనగర్‌లోనే రోబోటిక్ శస్త్ర చికిత్సలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించామన్నారు. కరీంనగర్లో రాష్ట్ర స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం శుభపరిణామమని, వైద్యులందరూ తమ కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారని, వారికి అండగా ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి బంగారి స్వామి, మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ బండారి రాజ్‌కుమార్, చెన్నాడి అమిత్‌కుమార్, వెంకట్‌రెడ్డి, కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మోతీలాల్, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్, రాష్ట్ర బాధ్యులు తిమ్మారెడ్డి, రాంరెడ్డి, కుమార్‌గౌడ్ నారగోని, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.